Hyderabad: ఫ్లాట్‌ నుంచి 'ఇం​టి' వైపు!.. ఆ గృహాలకు భారీ డిమాండ్‌

15 Oct, 2022 22:41 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్లకు తగ్గిన గిరాకీ 

అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య లక్షకుపైనే.. 

ఉమ్మడి వసతులు, ఎక్కువ కుటుంబాలు ఉండటమే కారణం 

కరోనా అనంతరం కొనుగోలుదారుల్లో మారిన ఆసక్తి 

వ్యక్తిగత ఇళ్లకు గణనీయంగా పెరిగిన డిమాండ్‌ 

గ్రీనరీ, ఆహ్లాదకర వాతావరణం, పూర్తిగా మన సొంతమన్న భావన

నగర శివార్లలో ఉన్నా కనెక్టివిటీ పెరగడంతోనూ మొగ్గు

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత (ఇండివిడ్యువల్‌) గృహాలకు మాత్రం డిమాండ్‌ పెరిగింది. కరోనా అనంతర పరిణామాలు, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అంటున్నారు. అప్పట్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపిన కొనుగోలుదారులు.. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్త పచ్చదనంతో, రణగొణధ్వనులకు దూరంగా, ఆహ్లాద వాతావరణం ఉండే ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 

కరోనాతో మారిన అభిరుచులు 
కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలతో ప్రజల జీవన విధానంలో, గృహ కొనుగోలుదారుల తీరులో మార్పులు వచ్చాయి. గతంలో ప్రధాన నగరంలో, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే గృహాలను కొనుగోలు చేసేవారు. కోవిడ్‌ తర్వాత ఒకేచోట ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రం హోమ్‌తో ఇంట్లో ప్రత్యేకంగా గది, ఓపెన్‌ జిమ్‌ వంటివి అవసరమయ్యాయి. దీనివల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యక్తిగత గృహాలు, విల్లాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ సీఎండీ టీవీ నరసింహారెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువు కావడం దీనికి మరింత ఊతమిచ్చిందని చెప్పారు. 

హైదరాబాద్‌ నలువైపులా.. 
గతంలో పటాన్‌చెరు, బెంగళూరు జాతీయ రహదారుల మార్గంలో అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాల్లోనే వ్యక్తి గత గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ నలువైపులా కొత్త రోడ్లు వచ్చాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ లింక్‌ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీంతో మెట్రో, 100 ఫీట్ల రోడ్లు ఉన్న మార్గాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇండిపెండెంట్‌ గృహాలకు డిమాండ్‌ పెరిగింది. శ్రీశైలం హైవే, ముంబై రహదారి, బీజాపూర్‌ రోడ్, నాగ్‌పూర్‌ రోడ్డు, వరంగల్‌ హైవేలో ఘట్‌ కేసర్‌ వరకు కూడా వ్యక్తిగత గృహాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రాంతాల్లో ముందుగా ఇండిపెండెంట్‌ ఇళ్లు, విల్లాలు వచ్చి.. రద్దీ పెరిగాక అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ ప్రారంభమవుతుందని యార్డ్స్‌ అండ్‌ ఫీట్స్‌ కన్సల్టెన్సీ ఎండీ కళిశెట్టి నాయుడు తెలిపారు. 

మారిన పరిస్థితులతో.. 
ఐటీ మినహా ఇతర రంగాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవటం, పలు రంగాల్లో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం అమలవుతుండటంతో హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా గతంలో తరహాలో గృహ రుణాలను మంజూరు చేయడం లేదు. గతేడాది 7.30 శాతం దాకా తగ్గిన వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి పెరిగాయి. దీనికితోడు నిర్మాణ వ్యయాలూ పెరగడంతో.. ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ (మూడో త్రైమాసికం) ముగింపు నాటికి బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధిక గృహాల ఇన్వెంటరీ (అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 7.85 లక్షల అపార్ట్‌మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రాప్‌ టైగర్‌ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇళ్లే లక్షకుపైగా ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని తెలిపింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 2,72,960 ఇళ్ల ఇన్వెంటరీతో ముంబై తొలిస్థానంలో ఉందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు