సీటీ బస్సుల్లో రెండు గంటలు ఉచిత ప్రయాణం!

23 May, 2022 07:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుష్పక్‌ బస్సుల్లో ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు డబుల్‌ ధమాకా. ఎయిర్‌పోర్టు నుంచి పుష్పక్‌లో టికెట్‌ తీసుకున్నప్పటి నుంచి రెండు గంటల పాటు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రమయానికి నడిచే పుష్పక్‌ బస్సుల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ వినూత్నమైన పథకానికి  శ్రీకారం చుట్టింది.

మరో వారం, పది రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. విమానాశ్రయం నుంచి  పుష్పక్‌లో వచ్చే  ప్రయాణికులు తీసుకొనే టికెట్లపైనే ఈ రెండు గంటల ఉచిత  ప్రయాణం నమోదై ఉంటుంది. ఎయిర్‌పోర్టు  ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది.  

ఠంచన్‌గా  పుష్పక్‌... 

  • ప్రస్తుతం  39 పుష్పక్‌ బస్సులు నగరంలోని  జేఎన్‌టీయూ, పర్యాటక భవన్, సికింద్రాబాద్, తదితర  ప్రాంతాల నుంచి  వివిధ  మార్గాల్లో  ఎయిర్‌పోర్టు వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. 
  • ప్రయాణికుల  అవసరాలకనుగుణంగా ఈ బస్సులు  24 గంటల పాటు అందుబాటులో ఉండేవిధంగా నడుపుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వచ్చేటప్పుడు  ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  70శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడుస్తున్నాయి. కానీ నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయంలోనే 25 నుంచి 30 శాతం వరకే ఆక్యుపెన్సీ నమోదవుతోంది. 
  • ఫ్లైట్‌ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది ప్రయాణికులు  ఎయిర్‌పోర్టుకు వెళ్లేటప్పుడు క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో  వెళ్తున్నట్లు ఆర్టీసీ  గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని  సిటీ నుంచి బయలుదేరే  ప్రతి బస్సు కచ్చితమైన సమయపాలన పాటించేవిధంగా చర్యలు చేపట్టారు. బస్సుల సమయపాలనపై  ప్రయాణికులకు నమ్మకాన్ని కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. బస్సుల్లో, బస్‌షెల్టర్‌లో  కచ్చితమైన వేళలను ప్రదర్శించనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  
  • పుష్పక్‌ల నిర్వహణపై ఎప్పటికప్పుడు  ప్రయాణికుల స్పందన  తెలుసుకొనేందుకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను  ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల నుంచి అందే సమాచారం ఆధారంగా బస్సుల నిర్వహణలో మార్పులు, చేర్పులు ఉంటాయి.  

ఫ్లైట్‌ వేళలతో అనుసంధానం.. 

  • హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 190కిపైగా జాతీయ విమాన సర్వీసులు, మరో 30కిపైగా అంతర్జాతీయ విమానాసర్వీసులు నడుస్తున్నాయి. 
  • రోజుకు 40 వేల నుంచి 50  వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పుష్పక్‌లను వినియోగించుకొనేవారి సంఖ్య 5వేలు మాత్రమే. కనీసం మరో 10 వేల మంది ప్రయాణికులను పెంచుకోగలిగినా పుష్పక్‌ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరుగుతుందని అధికారుల అంచనా. 
  • ఇందుకనుగుణంగా విమానాల వేళలను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సు సకాలంలో ఎయిర్‌పోర్టుకు చేరేవిధంగా పుష్పక్‌ల నిర్వహణపై ఆర్టీసీ  అధికారులు దృష్టి సారించారు.    

(చదవండి: వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్‌)

మరిన్ని వార్తలు