Putta Madhu: 10 రోజుల అజ్ఞాతంపై నోరు విప్పిన పుట్టా!

12 May, 2021 11:04 IST|Sakshi

కేసులకు భయపడి పారిపోయా!

వామన్‌రావు దంపతుల హత్యతో సంబంధం లేదు 

పోలీసుల విచారణలో పుట్ట మధు వెల్లడి 

కేసు పురోగతి దిశగా లభించని ఆధారాలు!

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హైకోర్టు న్యాయ వాది వామన్‌రావు దంపతుల హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. సంబంధం లేనప్పుడు 10 రోజుల పాటు ఎందుకు పారిపోయారని ప్రశ్నించగా.. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లానని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను, ఇతరులు వారి వ్యక్తిగత కారణాల వల్లనే వామన్‌రావు దంపతులను హత్య చేసి ఉంటారని పేర్కొ న్నట్టు సమాచారం.

దీంతో కేసు పురోగతి దిశగా పోలీసులకు ఆధారాలేమీ లభించలేదని తెలిసింది. మంగళవారం నాలుగో రోజు మధు దంపతులను గంటన్నరపాటు విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు. తామెప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేర్వేరు వాహనాల్లో వచ్చిన మధు, ఆయన భార్య శైలజను పోలీసులు వేర్వేరుగానే విచారించారు. ఈ కేసులో వీరి ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. 

34 ఖాతాల పరిశీలన పూర్తి  
ఈ కేసుకు సంబంధించి పలువురి బ్యాంకు ఖాతాలను 4 రోజులుగా పరిశీలించిన పోలీసులు.. అనుమానాలకు తావిచ్చే స్థాయిలో లావాదేవీలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం 39 ఖాతాల ను పరిశీలించాల్సి ఉండగా.. ఇంకా 5 ఖాతాల సమాచారం రావలసి ఉందని ఓ అధికారి తెలిపారు. దీంతో మరో 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంటికి వెళ్లేందుకు అనుమతి 
పుట్ట మధును ఈనెల 8న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం నుంచి రామగుండం తీసుకువచ్చినట్లు ప్రకటించిన పోలీసులు.. సోమవా రం రాత్రి వరకు కమిషనరేట్‌లోనే ఉంచి విచారించారు. తర్వాత  ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాత్రి 11 గంటల తర్వాత మంథని వచ్చిన మధుకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్శిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌రఘువీర్‌సింగ్, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి కలిశారు.
చదవండి: Etelaకు చెక్‌.. టీఆర్‌ఎస్‌ భావి నేతగా తెరపైకి కౌశిక్‌ రెడ్డి!

మరిన్ని వార్తలు