‘సీతారామ’ను పర్యవేక్షించాలి

17 Sep, 2020 09:40 IST|Sakshi

మంత్రి పువ్వాడకు సూచించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రి పువ్వాడకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ను మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు కేటాయించిన నిధులు, పనుల వివరాల గురించి మంత్రిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో మంజూరు చేసిన పనులు దాదాపు పూర్తి కావొచ్చాయని వివరించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టు పనులపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం వస్తుందన్నారు. 6.20 లక్షల ఎకరాలను గోదావరి జలాలతో తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆయా బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. మంత్రి వెంట సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు హరిప్రియనాయక్‌ ఉన్నారు.  

మరిన్ని వార్తలు