రూ.3,904 కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో క్వాల్కమ్‌ కార్యకలాపాల విస్తరణ 

23 Mar, 2022 04:24 IST|Sakshi
క్వాల్కమ్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేష్‌రంజన్‌ 

8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఆయా సంస్థల ప్రతినిధి బృందాలతో మంత్రి కేటీఆర్‌ వరుస భేటీలు 

సాక్షి, హైదరాబాద్‌: మరో మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. భారీ పెట్టుబడులతో ఆ కంపెనీలు తరలిరానున్నా యి. ఈ కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. సాఫ్ట్‌ వేర్, వైర్‌లెస్‌ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల రంగంలో క్వాల్కమ్, గోల్ఫ్‌ బ్రాండ్‌లలో ‘కాల్‌అవే గోల్ఫ్‌’తోపాటు ఎలక్ట్రిక్‌ వాహన రంగం లోని ఫిస్కర్‌ కంపెనీ తమ కార్యాలయాలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్‌తో మం గళవారం శాండియాగోలోని క్వాల్కమ్, ‘కాల్‌అవే గోల్ఫ్‌’, లాస్‌ ఏంజెలిస్‌లోని ఫిస్కర్‌ ప్రధాన కార్యా ల యాల్లో ఆ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు.

క్వాల్కమ్‌ సంస్థ సీఎఫ్‌వో ఆకాశ్‌ ఫాల్కీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌ జిన్, లక్ష్మి రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్సింగ్‌లతో కూడిన ప్రతినిధుల బృందం కేటీఆర్‌తో చర్చలు జరిపింది. క్వాల్కమ్‌ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయా న్ని హైదరాబాద్‌లో ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ప్రారంభించనుందని తెలిపింది. పెట్టుబడి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, వచ్చే ఐదేళ్లలో దశలవారీగా రూ.3,904 కోట్లు పెట్టనున్నట్లు, 8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ పాల సీల వల్లే తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు క్వాల్కమ్‌ ప్రతినిధి బృం దం వెల్లడించింది. అగ్రిటెక్, విద్యారంగం, కనెక్టెడ్‌ డివైస్‌ల వినియోగం, స్మార్ట్‌ సిటీ కార్యక్రమాల్లో భాగస్వామ్యానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ వంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్‌ పెట్టుబడి ఉపయోగపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఫిస్కర్‌ ఐటీ, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌..
లాస్‌ ఏంజెల్స్‌లోని ఫిస్కర్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో హెన్రీక్‌ ఫిస్కర్, సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌లతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారనుందని కేటీఆర్‌ వివరించా రు. జఢ్‌ఎఫ్, హ్యుందాయ్‌ వంటి పలు కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

ఆటోమొబైల్‌ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను త్వర లో ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి కోరగా ఫిస్కర్‌ కంపెనీ అంగీకరిం చింది. ఈ సెంటర్‌తో 300 మంది టెక్‌ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని కంపెనీ తెలిపిం ది. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. ఫిష్కర్‌ కంపెనీ తయారు చేసిన ఓషన్‌ మోడల్‌ ఎలక్ట్రిక్‌ కారును కేటీఆర్‌ పరిశీలించారు.  

‘కాల్‌అవే’తో 300 మందికి ఉపాధి.. 
‘కాల్‌అవే గోల్ఫ్‌’ సంస్థకు ఏటా 3.2 బిలియన్‌ డాల ర్ల రాబడి ఉంది. హైదరాబాద్‌ కాల్‌అవే డిజిటెక్‌ సెంటర్‌ ద్వారా ప్రాథమిక దశలో 300 మంది సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌తో కార్యకలాపాలు ప్రారంభమ వుతాయి. అంతర్జాతీయ కార్యకలాపాలకు డేటా ఎనలిటిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ద్వారా అవసరమైన సేవలను హైదరాబాద్‌ డిజిటెక్‌ సెంటర్‌ ద్వారా అందిస్తుంది. అత్యంత విలువైన గోల్ఫ్‌ క్రీడాపరికరాలు, వివిధ రంగాలకు చెందిన వారి అభిరుచుల మేరకు అంతర్జాతీయ బ్రాండ్లను కలిగి ఉన్న సంస్థగా కాల్‌అవేకు పేరుంది.

కాల్‌అవే గోల్ఫ్, ఒజియో, ట్రావిస్‌ మ్యాథ్యూ, జాక్‌ వోల్ఫ్‌స్కిన్‌ వం టి ప్రముఖ బ్రాండ్లు కాల్‌అవే జాబితాలో ఉన్నా యి. కేటీఆర్‌ భేటీలో స్పోర్ట్స్‌ టూరిజం, రాష్ట్రంలో క్రీడాపరికరాల తయారీ అవకాశాలపై చర్చించడం తోపాటు అనేక నగరాల పేర్లు పరిశీలించిన తర్వాత హైదరాబాద్‌ను డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనువైనదిగా ఎంపిక చేసినట్లు కాల్‌అవే ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, చీఫ్‌ రిలేషన్స్‌ అధికారి ఆత్మకూరి అమర్‌నాథ్‌రెడ్డి, డిజిటల్‌ మీడియా డైరె క్టర్‌ దిలీప్‌ కొణతం, కాల్‌అవే తరపున కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ బ్రియాన్‌ లించ్, సీఐవో సాయి కూరపాటి పాల్గొన్నారు.  


 

మరిన్ని వార్తలు