సెల్‌ఫోన్‌లు చూస్తూ పేపర్లు చింపుతున్నారు.. కారణం ఏంటంటే..

19 Aug, 2021 07:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌): శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్‌ భౌతిక శాస్త్రం క్వశ్చన్‌ పేపర్‌ కొందరు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు రావడంతో బుక్‌లో అందులోని సమాధానాలు వెతుక్కుంటూ పరీక్షా కేంద్రం బాధ్యులకు పట్టుబడ్డారు. కళాశాల కేంద్రం వారు శాతవాహనకు సమాచారం అందించగా 9 మంది సెల్‌ఫోన్‌లు సీజ్‌ చేసి విచారణకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్‌ చేసింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్‌యూ పరీక్షల విభాగం తెలిపింది. 

ఇలా జరిగింది...?
డిగ్రీ 6,4వ సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6వ సెమిస్టర్‌ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ సెమిస్టర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఎస్సారార్‌ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే ఉండడాన్ని పరిశీలించిన ఎస్సారార్‌ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూడగా సెల్‌ఫోన్‌లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది.

వెంటనే సెల్‌ఫోన్‌లు తీసుకొని చూడగా ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన ఎస్సారార్‌ అధ్యాపకులు శాతవాహన యూనివర్సిటీకి సమాచారమందించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్‌ఫోన్‌లు సీజ్‌ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు.

ప్రశ్నాపత్రం లీక్‌పై విచారణ కమిటీ..
ఈ విషయాన్ని ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్‌ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిటీ త్వరలోనే నిజానిజాలు తేల్చి సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. 

లీక్‌ చేసిందెవరు...?
ప్రశ్నాపత్రం లీక్‌ చేసింది ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, కళాశాల, ప్రయివేట్‌ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్‌/బాధ్యులకు ఆన్‌లైన్‌లో ఏ రోజుకారోజు పరీక్షా సమయానికి అరగంట ముందు మాత్రమే యూనివర్సిటీ నుండి వస్తుంది. దానిని ప్రింట్‌ తీసి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు అందిస్తారు. అరగంట ముందు ఇచ్చిన క్వశ్చన్‌ పేపర్‌ ఎలా విద్యార్థుల సెల్‌ఫోన్‌లకు వెళ్లిందనే విషయాలు తెలియకుండా ఉన్నాయి. దీని వెనక యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారా.. లేదా కళాశాలల వారు ఉన్నారా అనే విషయాలు విచారణ చేపడుతున్నారు.  

ప్రత్యేక కమిటీ వేశాం..
విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ప్రశ్నాపత్రం వచ్చిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుగుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బా«ధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.  

– డాక్టర్‌ శ్రీరంగప్రసాద్, ఎస్‌యూ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ 

మరిన్ని వార్తలు