విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రశ్నాపత్రాలు.. వీసీ సీరియస్‌

20 Aug, 2021 07:26 IST|Sakshi
రిజిస్ట్రార్‌కు వినతిపత్రం ఇస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్‌): శాతవాహనయూనివర్సిటీ డిగ్రీ పరీక్షల 6వ సెమిస్టర్‌ ప్రశ్నాపత్రం ఓ ప్రయివేటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాట్సాప్‌గ్రూపులో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వీసీ మల్లేశ్‌ సీరియస్‌గా తీసుకున్నారు. డిగ్రీ మూడు, ఐదో సెమిస్టర్‌ పరీక్షలకు కోవిడ్‌ కారణంగా సెల్ఫ్‌సెంటర్లు ఏర్పాటుచేశారు. దీని కారణంగా కొన్ని ప్రయివేటు కళాశాలల్లో విచ్చలవిడిగా మాస్‌ కాపీయింగ్‌ జరిగిందని గుర్తించిన వీసీ 12వ తేదీ నుంచి జరుగుతున్న 4, 6వ సెమిస్టర్లకు జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు.

ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తుండగా.. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పట్టుకొని కేసు నమోదుచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సెల్‌ఫోన్లలో ప్రశ్నాపత్రం ప్రత్యక్షం కావడాన్ని వీసీ సీరియస్‌గా తీసుకున్నారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

రెండు, మూడు రోజుల్లో నివేదిక
ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై శాతవాహన వీసీ మల్లేశ్‌ నలుగురితో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదే శించారు. గురువారం కమిటీ తన పనిని ప్రారంభించగా.. శనివారం దీనిపై ప్రత్యేకసమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహా రంలో కొన్ని ప్రముఖ కళాశాలలకు చెందిన వారి హ స్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పటి నుంచి లీకవుతున్నాయి.. 
ఎస్సారార్‌ కళాశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న నగరానికి చెందిన ఓ ప్రయివేటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రశ్నాపత్రం రావడం, అప్పుడే వర్సిటీ అధికారులకు సమాచారం చేరడంతో విషయం బయటకు పొక్కింది. కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కొన్ని రోజుల నుంచే జరుగుతోందని చర్చ జరుగుతోంది. కొంతమంది విద్యార్థులు పేపర్‌ లీక్‌ విషయం కొత్తేమి కాదని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుధవారం పలువురు విద్యార్థుల సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమైన ప్రశ్నాపత్రం వర్సిటీవ్యాప్తంగా వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీస్‌ నిఘా
శాతవాహనలో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిసింది. వర్సిటీ వేసిన ప్రత్యేక కమిటీతో నిజం తేలిన తర్వాత బాధ్యులపై చర్యలకు యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చర్చజరుగుతోంది. ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ వర్సిటీలో గురువారం జరిగిన ఒక సమావేశంలో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సీజ్‌చేసిన తొమ్మిదిసెల్‌ఫోన్లు ఇవ్వమని వీసీ స్పష్టం చేశారు.

   

మరిన్ని వార్తలు