కల్వకుర్తి ఆయకట్టుకు పాలమూరు నీళ్లు!  

2 Aug, 2020 05:14 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డిలోని ఏదుల, వట్టెం రిజర్వాయర్‌ల నుంచి నీళ్లిచ్చేలా ప్లాన్‌

కనీసంగా లక్ష ఎకరాలకు నీరందించే అవకాశం ఉందని గుర్తింపు

లింక్‌ కాల్వల తవ్వకానికి రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా

ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పూర్తికి మంత్రుల ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల సద్వినియోగం లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి కింద నిర్ణయించిన ఆయకట్టుకు పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్‌ల ద్వారా నీటిని అందించేలా ప్రణాళిక రచిస్తోంది. కల్వకుర్తి కింద కనీసంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు పాలమూరులోని ఏదుల, వట్టెం రిజర్వాయర్‌ల నుంచి నీటిని ఇవ్వడం ద్వారా స్థిరీకరణ చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఈ రెండు రిజర్వాయర్‌లు సిద్ధమైనందున కల్వకుర్తి కాల్వలకు వీటి నుంచి లింక్‌ కాల్వలు తవ్వే అవకాశాలపై ప్రస్తుతం సర్వే చేయిస్తోంది. ఈ సర్వే ముగిసిన అనంతరం నీటి సరఫరాకు శ్రీకారం చుట్టనుంది.  

మరింత నిల్వ..ఆయకట్టుకు భరోసా
కల్వకుర్తి కింద నిజానికి మొదట 2.50 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించినా, తదనంతరం ఆయకట్టును 4.35 లక్షల ఎకరాలకు పెంచారు. నీటి కేటాయింపులు సైతం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. ఈ నీటిని శ్రీశైలం నుంచి వరద ఉన్న రోజుల్లోనే ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే కల్వకుర్తి పథకంలో మొత్తంగా 3.40 టీఎంసీల సామర్థ్యం ఉన్న మూడు రిజర్వాయర్‌లు మాత్రమే ఉన్నాయి. దీంతో వరద రోజుల్లో నీటి నిల్వ చేసే అవకాశం లేదు. ఈ దృష్ట్యానే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లివ్వడం కత్తిమీద సాములా మారుతోంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి ఆయకట్టు పరిధిలోనే నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్‌ల ద్వారా నీటిని పంపిణీ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలోనే తెరపైకి తెచ్చారు. అయితే పాలమూరు–రంగారెడ్డిలోని తొలి రిజర్వాయర్, పంప్‌హౌజ్‌ ఉన్న నార్లాపూర్‌ పూర్తి కాకపోవడంతో ఈ ప్రయత్నం ముందుకు పోలేదు. అయితే నార్లాపూర్‌ దిగువన 6.55 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఏదుల రిజర్వాయర్‌ పనులు 98 శాతం పూర్తయ్యాయి. దీంతో పాటే దిగువన ఉండే 16.58 టీఎంసీల సామర్థ్యం ఉండే వట్టెం రిజర్వాయర్‌ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. ఈ రెండు రిజర్వాయర్‌లకు దగ్గరి నుంచి కల్వకుర్తి కాల్వలు వెళుతున్నాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకొనే కల్వకుర్తి కాల్వలను మొదట ఏదుల రిజర్వాయర్‌తో అనుసంధానించి, దీన్ని నింపుతూ, ఈ రిజర్వాయర్‌ ద్వారానే కల్వకుర్తిలో భాగంగా ఉండే బుద్ధారం, ఘణపురంల కింది ఆయకట్టుకు సాగునీటిని పారించే అవకాశాలున్నాయని ఇంజనీర్లు అంచనా వేశారు. దీనికోసం 25 కిలోమీటర్ల మేర లింక్‌ కాల్వలు తవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిద్వారా 40వేల ఎకరాలకు నీళ్లివ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లింక్‌ కెనాల్‌ కోసం సర్వే చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ఫలించాలంటే పాలమూరులో ముంపునకు గురవుతున్న ఓ గ్రామంలో సహాయ పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ గ్రామ ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియ వేగిరం చేయాలని రెండ్రోజుల కిందే జిల్లా మంత్రులు అధికారులకు ఆదేశాలిచ్చారు.

వట్టెం రిజర్వాయర్‌ కింద...
వట్టెం రిజర్వాయర్‌ కింద 2–4 కిలోమీటర్ల లింక్‌ కెనాల్‌ తవ్వితే కల్వకుర్తి కింద మరో 60 వేల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది.  ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. పాలమూరు–రంగారెడ్డిలోని మొదటి పంప్‌హౌస్‌ పనులు ఆలస్యమైనా, ఈ విధంగానే లబ్ధి తీసుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అయితే, వచ్చే ఏడాదికి ఈ ప్రతిపాదనను పట్టాలెక్కించే అవకాశం ఉందని ప్రాజెక్టుల అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు