వర్సిటీల్లో సమస్యలను పరిష్కరించాలి: కృష్ణయ్య 

17 Jul, 2022 03:32 IST|Sakshi
విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదుట నిరసనలో పాల్గొన్న ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

గన్‌ఫౌండ్రీ: తెలంగాణ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయి ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతినే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. పూర్తిస్థాయి టీచర్లను నియమించే వరకు 16 వేల మంది విద్యా వాలంటీర్లను కొనసాగిస్తూ వారిని రెన్యూవల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కస్తూర్బా పాఠశాలలో గతంలో పని చేసిన 937 మంది కాంట్రాక్టు టీచర్లను కొనసాగించాలని కోరారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో కలుషిత ఆహారం వలన ఆస్పత్రిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు