డిగ్రీ ఫీజు గడువుపై వీసీని ఒప్పించా: ఆర్‌. కృష్ణయ్య 

14 Jun, 2022 01:20 IST|Sakshi

ముషీరాబాద్‌: ఈ నెల 10న ముగిసిన డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వర్సిటీ 14వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. ఆ మేరకు అమెరికాలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌తో ఫోన్లో మాట్లాడి ఒప్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బడ్జెట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు, స్పెషల్‌ ఫీజులు కట్టే వరకు కాలేజీ యాజమాన్యాలు పరీక్ష ఫీజులు తీసుకోవడం లేదన్నారు.

సర్దుబాటు చేసి కట్టేలోగా ఫీజు గడువు ముగిసిందని, దీంతో తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోందని వందలాది మంది విద్యార్థులు బీసీ భవన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారని కృష్ణయ్య తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి, ఉస్మానియా వీసీలతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు ఓ అవకాశం ఇవ్వాలని తాను కోరగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు.  

రేపు హాల్‌టికెట్లు: రిజిస్ట్రార్‌ 
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నేడు(జూన్‌14) అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేర కు ఫీజు చెల్లింపు గడువును సడలిస్తూ ఒక్కరోజు అవకాశమిచ్చినట్లు చెప్పారు. బుధవా రం (15న) నుంచి హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు