‘బీసీల మహాధర్నా’ ఉద్రిక్తం

30 Mar, 2022 03:44 IST|Sakshi
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన మహాధర్నాలో ఆర్‌. కృష్ణయ్య తదితరులు

పార్లమెంటు ముట్టడికి యత్నించగా అడ్డుకున్న పోలీసులు 

బిల్లు పెట్టకుంటే ఆగస్టులో పార్లమెంట్‌ ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య 

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జరిగిన బీసీల మహా ధర్నా ఉద్రిక్తంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో వందలాదిమంది జంతర్‌మంతర్‌ వేదికగా మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం పార్లమెంట్‌ ముట్టడిగా మారింది.

పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీస్‌ ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో బీసీ నేతలు వెనక్కి తగ్గారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వబోమని, ఆగస్టులో 5 లక్షల మంది బీసీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుతో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థ్ధిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.

ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోండి 
బీసీలకు హక్కులను కల్పించే విషయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆర్‌.కృష్ణయ్య సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టింది కేవలం వైఎస్సార్‌సీపీనే అని, నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50% బీసీలకే పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు.

మరిన్ని వార్తలు