పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వాలి 

29 Aug, 2020 03:17 IST|Sakshi

ఆన్‌లైన్‌ క్లాసులపై సీఎంకు ఆర్‌.కృష్ణయ్య లేఖ

సాక్షి, హైదరాబాద్‌: పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల ఫలాలు అందాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు కొనివ్వాలని ప్రభు త్వాన్ని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం సిద్ధమవడం మంచి నిర్ణయమన్నారు. అయితే, మారుమూల, గిరిజన గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఇప్పటికీ లక్షలాది ఇళ్లలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు లేవని గుర్తుచేశారు. అందువల్ల ఇలాంటి ఇళ్లలోని పిల్లలు ఆన్‌లైన్‌ పాఠాలు ఆన్‌లైన్‌ పాఠాలు వినే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పేద పిల్లలకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే టీవీల ద్వారా పాఠ్యబోధనలో వివరణ కోరడానికి, విద్యార్థుల సందేహాలు తీర్చడానికి వీలుపడదన్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాలలో ‘‘టీశాట్‌’’ప్రసారాలు రావడం లేదని చెప్పారు. ‘ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉంటే పాఠాలు ఒకరే వింటారు. మిగతావారి సంగతి ఏమిట’ని ప్రశ్నించారు. దీంతో లక్షలాది విద్యార్థుల చదువు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పేద విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలంటే వారికి వెంటనే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు కొనివ్వాలని ఆ లేఖలో కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు