-

ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే 

27 Aug, 2023 06:24 IST|Sakshi

ఎల్బీనగర్‌ ఘటనపై రవీంద్రనాయక్‌ ఫిర్యాదు 

సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌ డిమాండ్‌ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్‌ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు.

అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్‌ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్‌ ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్‌ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్‌ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్‌ తేల్చిచెప్పారు.
 

మరిన్ని వార్తలు