వ్యాక్సిన్‌ రేస్‌.. అందరికీ టీకా.. ఎందాక?

30 Aug, 2020 01:57 IST|Sakshi

There is always light at the end of the Tunnel
సొరంగానికి చివరలో వెలుతురు ఎప్పుడూ ఉంటుంది!
ఈ ఆంగ్ల సామెత కోవిడ్‌–19 ప్రపంచానికి అతికినట్లు సరిపోతుంది. ఒకవైపు రష్యా టీకా వచ్చేసిందని చెబుతోంది. ఇంకోవైపు..  పలు దేశాల్లో టీకాల... రెండు, మూడవ దశల మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కచ్చితంగా ఇంకో 66 రోజుల్లో టీకా అందుబాటులోకి వచ్చేస్తుందని భారత్‌ లాంటి దేశాలు భావిస్తుంటే.. 2021 మార్చిలోపు సాధ్యం కాదని ఇతరులు తేల్చేస్తున్నారు!ఈ నేపథ్యంలో తొలి అడ్డంకులు దాటుకుని రేసులో ముందున్న టీకాలేవి? సిద్ధమైనవి.. అందరికీ దక్కుతాయా? లేక కొందరికే పరిమితమవుతాయా? శాస్త్ర వేత్తల పరిశోధనల ఫలితంగా ఆవిష్కారమైన కొత్త ప్రత్యామ్నాయాలేమిటి? 

నిన్న మొన్నటివరకూ కోవిడ్‌ కారక కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ఓ మార్గమంటూ లేదు. రోగమొస్తే ఏం మందు వేయాలో తెలియదు. వ్యాధిగ్రస్తుడిని ఎలా చూసుకోవాలో అర్థం కాలేదు. మరి ఇప్పుడు పూర్తిగా కాకపోయినా కొంతమేర అవగాహన వచ్చింది. భవిష్యత్తులో ఈ మహమ్మారి మరింత విజృంభించకుండా.. నిరోధించే టీకా ప్రయత్నాలూ ఊపందుకుని తుది దశకు చేరుకున్నాయి. అయితే ఈ సమయంలోనే ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఒక సంశయం ఏమిటంటే..  సామాన్యుడికి టీకా ఎప్పుడు అందుతుంది? అన్నది! అమెరికా ఉన్న 30 కోట్ల జనాభాకు వేల కోట్లు ఖర్చుపెట్టి 80 కోట్ల డోసులను రిజర్వ్‌ చేసుకోగా.. పేద దేశాలు బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ , గావి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వంటి సంస్థలవైపు ఆశగా చూస్తున్నాయి. ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా అమెరికా ఏకంగా ఆరు వ్యాక్సిన్‌  ప్రయోగాలపై డబ్బు కుమ్మరిస్తోంది. దీనికి తోడు అత్యవసర పరిస్థితుల సాకుతో దశాబ్ద కాలం పట్టే టీకా అభివృద్ధి కార్యక్రమాన్ని కాస్తా పది నెలలు కూడా సాగకుండానే మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతుండటం.. టీకా భద్రత, సామర్థ్యాల విషయంలో రాజీ పడటమే అన్నది నిపుణుల అభిప్రాయం. వ్యాక్సిన్లు కొందరికే పరిమితం కాకుండా జాగ్రత్త పడాల్సిన తరుణమిదే అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది.

ఈ ప్రమాదాన్ని నివారించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ, యూరో పియన్‌  యూనియన్‌లు టీకా పరిశోధనలు, పేటెంట్లను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. కోవ్యాక్స్‌ పేరుతో ఏర్పాటైన ఓ వ్యవస్థ ధనిక దేశాలతో కలిసి టీకా అందరికీ అందుబాటులో ఉండేందుకు తమవంతు ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయోగం ఎంతవ రకూ విజయవంతమవు తుందో కాలమే చెప్పాలి. కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్న టీకాలను ముందుగా 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఆరోగ్య కార్యకర్తలకు, గుండెజబ్బు, మధుమేహం వంటి ఇతర సమస్యలున్న వారికి అందించాలని డబ్ల్యూహెచ్‌ఓ భావిస్తోంది. అమెరి కాలోని సీడీసీ ఐదంచెల కార్యక్రమంతో కోవిడ్‌ కారణంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న నల్ల జాతీయులు, స్థానిక తెగల ప్రజలకూ, నిరాశ్రయులు, టీచర్లకు ముందుగా టీకా ఇవ్వాలని ప్రణాళిక. భారత్‌ విషయానికొస్తే.. నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌  ఇమ్యునైజేషన్‌  టీకా తొలిగా ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర వేడుకల్లో మాట్లాడుతూ.. వీలైనంత తొందరగా అందరికీ టీకా అందిస్తామని ప్రకటించారు. అయితే ప్రాథమ్యాలను నిర్ణయించడంలో,  ఏ వర్గానికి ఎన్ని టీకాలు అవసరమవుతాయన్నది తెలుసుకోవడం, టీకాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీ వంటి కొన్ని సమస్యలు తెచ్చిపట్టే అవకాశమైతే లేకపోలేదు.  

మరిన్ని వార్తలు