ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ప్రేయసి హ్యాండ్‌ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? 'రేజ్‌ రూమ్‌'లోకి వెళ్లాల్సిందే..!

15 Feb, 2023 07:39 IST|Sakshi

ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్‌ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్‌ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్‌లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్‌ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. 

సాక్షి, హైదరాబాద్‌: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్‌ రూమ్స్‌. వీటిని రేజ్‌ రూమ్స్, బ్రేక్‌ రూమ్స్, యాంగర్‌ రూమ్స్, డిస్ట్రక్షన్‌ రూమ్స్, స్మాష్‌ రూమ్స్‌... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. 

అసలేమిటీ రేజ్‌ రూమ్‌లు...? 
కోపం, కసి, ఫ్రస్ట్రేషన్‌ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్‌ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి.

ఎప్పుడు మొదలైందీ ట్రెండ్‌... 
2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్‌లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్‌ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్‌రూమ్‌లు ఇప్పటికే  ఏర్పాటయ్యాయి. 

మన దేశంలోనూ షురూ... 
2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్‌రూమ్‌’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో ‘భద్దాస్‌’–యాంగర్‌ రూమ్‌ అండ్‌ కేఫ్‌ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్‌రూమ్‌ను ఐఐటీ మద్రాస్‌ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్‌ హైదరాబాద్‌లో తొలి రేజ్‌రూమ్‌కు 25 ఏళ్ల సూరజ్‌ పూసర్ల శ్రీకారం చుట్టాడు. 

గదిలో ఏముంటాయి? 
పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్‌ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్‌... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. 

ఇవీ ప్యాకేజీలు..
ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్‌ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్‌ బుట్ట (బాటిల్‌ క్రేట్‌), ఓ కంప్యూటర్‌ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్‌ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్‌ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్‌ మోడ్‌’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్‌ ఓవెన్, వాషింగ్‌ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్‌ బ్యాగ్, బాక్సింగ్‌ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్‌ బాల్స్‌ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్‌ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్‌ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. 

పనికి రానివే.. 
పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్‌ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్‌
కేంద్రాలకుతరలిస్తాం. 
–నిర్వాహకులు

మరిన్ని వార్తలు