వైఎస్సార్‌పై వ్యాఖ్యలు: రఘునందన్‌ క్షమాపణలు

23 Nov, 2020 14:11 IST|Sakshi

రఘునందన్‌పై వైఎస్సార్‌ అభిమానుల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. వైఎస్సార్‌పై రాఘునందన్‌రావు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్లు సోషల్‌ మీడియా వేదికగా మహానేత అభిమానులు భగ్గుమంటున్నారు. వైఎస్సార్‌ పట్ల మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరిస్తున్నారు. రఘునందన్‌ వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని కూకట్‌పల్లిలో వైఎస్సార్‌ అభిమానులు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే నోటి దురుసుపై సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌ అభిమానులు ఉన్నారని, రఘునందన్‌ వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని సీనియర్లు పెదవి విరుస్తున్నారు. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురుస్తోంది. మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి చెంది.. ఒక్కసారి గెలవగానే అహంకారంతో పొంగిపొవద్దని హితవుపలుకుతున్నారు.

ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా పెను దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు. వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసేన సేవలు ఎంతో గొప్పవని, వాటిపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు