వాకింగ్‌ కోసం వెళ్లి.. మట్టి పెళ్లలు కింద మృతదేహమై

9 Jul, 2021 12:00 IST|Sakshi

 ప్రహరీ కూలి యువకుడి దుర్మరణం

సాక్షి, రహమత్‌నగర్‌: వాకింగ్‌ కోసం వెళ్లిన ఓ వ్యక్తి మట్టి పెళ్లలు కింద మృతదేహమై కనిపించాడు. బుధవారం మిత్రుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలి మీద పడటంతో ఆశిష్‌ (25) అనే యువకుడు అసువులు బాశాడు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. రహమత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరాంనగర్‌ పోచమ్మ ఆలయం సమీపంలోని శ్రీ అనూష రెసిడెంట్‌ ప్రహరీ బుధవారం సాయంత్రం వర్షం కారణంగా కూలిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్‌ లేకపోవడం, వర్షం మూలంగా ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా గురువారం ఉదయం జీహెచ్‌ఎంసీ సిబ్బంది జేసీబీతో మట్టి పెల్లలు తొలగిస్తుండగా అందులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది.   

తమ్ముడు కనిపించడం లేదని.. 
వాకింగ్‌ కోసమని వెళ్లిన తన తమ్ముడు కనిపించడం లేదని అంతకుముందు రోజు ఆశిష్‌ సోదరి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులను సంఘటన స్థలానికి తీసుకొచ్చారు. మృతుడి జేబులో ఉన్న కారు తాళం చెవిని చూసి ఆశిష్‌గా వారు గుర్తించారు. కల్యాణ్‌ నగర్‌ వెంటర్‌– 3కు చెందిన ఆశిష్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. నిత్యం వాకింగ్‌ కోసం వస్తూ అనూష రెసిడెంట్‌లో ఉండే మిత్రుణ్ని కలుస్తుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం స్నేహితుడిని కలిసి వెళ్తున్న క్రమంలో గోడ కూలడంతో మృత్యువాత పడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ప్రపుల్లా రెడ్డి, ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..  
రూ.కోట్ల వ్యయంతో అపార్ట్‌మెంట్‌ కట్టి ప్రహరీ నిర్మించపోవడంతోనే ప్రమాదం జరిగిందని బస్తీ వాసులు మండిపడుతున్నారు. మట్టితో కట్టిన పాత గోడతో ఎప్పుడైనా ప్రమాదం వాటిల్లవచ్చని.. దానిని తొలగించి కొత్త గోడను ఏర్పాటు చేసుకోవాలని బస్తీ వాసులు పల మార్లు అపార్ట్‌మెంటువాసులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

>
మరిన్ని వార్తలు