తెలంగాణ గొంతు నొక్కలేరు

8 Nov, 2022 00:26 IST|Sakshi
కామారెడ్డి జిల్లా మేనూర్‌లో జరిగిన బహిరంగసభకు హాజరైన కాంగ్రెస్‌ శ్రేణులు

మేనూర్‌ బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ 

ఇక్కడి సమాజంలో ప్రశ్నించేతత్వం, ఎదిరించే శక్తి ఉన్నాయి

దేశానికి ధైర్యాన్ని, శక్తిని అందించే సామర్థ్యం తెలంగాణకు ఉంది

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్రం, రాష్ట్రం విఫలం

తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం 

సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణ సమాజంలో ప్రశ్నించేతత్వం, ఎదిరించేశక్తి ఉన్నాయి. పసిపిల్లాడు కూడా నిలదీస్తాడు. తెలంగాణ గొంతును ఎవరూ నొక్కలేరు. ఎవరూ అణచివేయలేరు. దేశానికి ధైర్యాన్ని, శక్తిని అందించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. ఈ శక్తి దేశానికి ఎంతో అవసరం. తెలంగాణలో పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. తెలంగాణను వదిలివెళుతున్నందుకు బాధగా ఉంది.

తెలంగాణ ప్రజల ఆకాం­క్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికా­రం చేపట్టి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంది’అని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. భారత్‌ జోడో యా­త్రలో భాగంగా తెలంగాణలో చివరి రోజైన సోమవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మేనూర్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో రాహల్‌ ప్రసంగించారు.

సభకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహించగా మాజీ మంత్రి షబ్బీ­ర్‌ అలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌ సింగ్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూ­ర్, సీనియర్‌ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, మ«­దు­యాష్కీ, సంపత్‌ కుమార్, వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, గంగారాం, సుదర్శన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడా... 
రాష్ట్రంలోని దళితులు, ఆదివాసీలు, రైతు­లు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగు­ల­తో గంటలకొద్దీ మాట్లాడానని రాహుల్‌ గాంధీ చెప్పారు. బంగారు తెలంగాణ అనే వాగ్దానం కేవలం నోటిమాటగానే మిగిలిపోయిందని వారంతా పేర్కొన్నారని... వారి ఆశలు, కలలు ఎలా ఆవిరయ్యాయో, భవి­ష్య­త్తు ఎలా ప్రశ్నార్థకంగా మారిందో ఆవేదనతో తనకు వివరించారన్నారు. పాదయాత్రలో ఓ చిన్నారి ఒంటరిగా వచ్చి తనను కలిశాడని.. తండ్రి డెంగీతో బాధపడుతుండటం వల్ల వెంట రాలేకపోయినట్లు ఆ పిల్లాడు చెప్పాడన్నారు.

దీంతో చిన్నారి తండ్రికి వైద్యం చేయించాలని తన సిబ్బందిని పురమాయించినట్లు రాహుల్‌ వివరించారు. తెలంగాణలో పేదోడికి వైద్యం అందకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాన్ని ప్రైవేటుపరం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. అలాగే ఆ పిల్లాడు ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులు కట్టలేక చదువు మానేసే పరిస్థితి ఉందన్నారు. పేద పిల్లలు చదువుకోలేక, పేదలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తెలంగాణ ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణ కలలను టీఆర్‌ఎస్‌ పాలకులు ధ్వంసం చేశారని ఆరోపించారు. 

ఇందిరమ్మ భూములను లాక్కుంటున్నరు
దళితులు, గిరిజనులకు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రైతుల నుంచి లాక్కున్న భూములను కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిరిగి ఇస్తామన్నారు.  మోదీ సర్కార్‌ తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులకు టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. మోదీ, కేసీఆర్‌ కలిసే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పేదలు, రైతుల, సామాన్యుల ఆస్తులను లాక్కొని వ్యాపారవేత్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. 

కమీషన్ల కోసం కేసీఆర్‌ కక్కుర్తి... 
సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేశారని, రాత్రిపూట ధరణి పోర్టల్‌ను తెరిచి అక్రమాలకు పాల్పడుతున్నా­రని ఆరోపించారు. పేదలకు భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల కలలను నాశనం చేశాడన్నారు. 

ఇదో మరుపురాని ఘట్టం.. 
రాష్ట్రంలో పాదయాత్ర తనకు మరపురాని ఘట్టమని, ప్రజలు అందించిన ప్రేమానురాగాలు, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు తనలో కొత్త శక్తిని ఇచ్చాయన్నారు. ప్రజల నవ్వులు, కన్నీళ్లను తన మనసులో నింపుకుని ముందుకు సాగుతానన్నారు. సాంస్కృతికంగా తనకు కలిగిన విశిష్ట అనుభూతి, అనుభవాన్ని సదా స్మరించుకుంటానన్నారు. డప్పు వాయిద్యాల కోలాహలం, బోనాల సందడి, కొమ్ము, ధింసా నృత్యాలు తనకెంతో ఆనందాన్ని పంచాయన్నారు. అలాగే టీ కాంగ్రెస్‌ కార్యకర్తలు అందించిన స్ఫూ­ర్తిని ఎన్నడూ మరచిపోనని రాహుల్‌ పేర్కొన్నారు. కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు.  

కాగడాలతో ర్యాలీగా వెళ్తున్న రాహుల్, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు 

మరిన్ని వార్తలు