ఇంట్లో పోరు ఉండొద్దు.. కారుతో పొత్తుండదు

5 Apr, 2022 02:24 IST|Sakshi
ఢిల్లీలో రాహుల్‌తో భేటీ అయిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు

టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంని ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టండి 

గతం గతః.. విభేదాలు మాని ఏకతాటిపై పనిచేయండి 

టీకాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ 

తెలంగాణకు పూర్తి టైం కేటాయిస్తా

మీడియా ముందు విభేదాల గురించి మాట్లాడొద్దు 

ఏదైనా ఉంటే అధిష్టానానికి చెప్పేలా ఏర్పాటు చేస్తానని వెల్లడి 

3 గంటల పాటు అభిప్రాయాలను తెలుసుకున్న రాహుల్‌..

ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న కోమటిరెడ్డి విజ్ఞప్తికి సానుకూల స్పందన 

తెలంగాణలో ప్రతీ తలుపుతడతాం: రేవంత్‌

టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యం 
టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలను ఎదుర్కోవడంపైనే నేతలు దృష్టిపెట్టి పనిచేయాలి. టీఆర్‌ఎస్‌తోగానీ, ఎంఐఎంతోగానీ పొత్తు, స్నేహం లాంటి ఆలోచనలు ఉండనే ఉండవు. అలాంటి ఊహాగానాలను పట్టించుకోవద్దు. టీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యం. కొత్తవాళ్లను చేర్చుకోవడంపై దృష్టి పెట్టండి, యువతకు పెద్దపీట వేయండి.
మనం.. ఓ కుటుంబం.. 
గతంలో జరిగింది.. జరిగిపోయింది.. మనమంతా ఒక కుటుంబం.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలి. నేను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తా.. 
–టీపీసీసీ నేతలతో రాహుల్‌గాంధీ 

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ:  తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలను గట్టిగా ఎదుర్కోవడంపైనే దృష్టిపెట్టాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ అంతా ఒక కుటుంబమని.. ఇక నుంచి పార్టీ నేతలంతా విభేదాలు మాని ఏకతాటిపైకి రావాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40మంది ముఖ్య నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను విన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు. 

మీడియా ముందు మాట్లాడొద్దు 
పార్టీలో ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని  సూచించారు. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే అధిష్టానానికి చెప్పుకొనేలా తాను ఏర్పాటు చేస్తానని.. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో అధికారం సాధించాలని.. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని ఆదేశించారు. తాను కూడా తెలంగాణకు పూర్తి సమయం కేటాయిస్తానని పార్టీ నేతలకు మాట ఇచ్చారు. కాగా.. సమావేశంలో భాగంగా పలువురు నేతలు తమతో విడివిడిగా మాట్లాడాలని రాహుల్‌ను కోరారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. త్వరలోనే అందరికీ వన్‌టూవన్‌ చర్చల కోసం సమయం ఇస్తానని మాట ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర నేతలు చెప్పే అంశాలను వినేందుకే రాహుల్‌ ప్రాధాన్యత ఇచ్చారని.. ఆయన కేవలం ఏడెనిమిది నిమిషాల పాటు మాత్రమే మాట్లాడారని తెలిసింది. 

సునీల్‌ను పరిచయం చేసిన రాహుల్‌ 
భేటీ సందర్భంగా సునీల్‌ కనుగోలును టీపీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ పరిచయం చేసి, పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి సునీల్‌ తన పని తాను చేసుకుంటున్నారని, ఆయనను ఓ ఏజెన్సీగా భావించవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. సునీల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కర్‌ అని, ఆయన పూర్తిగా ఏఐసీసీ పరిధిలో పనిచేస్తారని, అవసరమైనప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సాయం తీసుకుంటారని వివరించినట్టు సమాచారం. 

గతంలో మాట్లాడినవి మర్చిపోయా.. 
భేటీ సందర్భంగా తాను పార్టీకోసం ఏమేం చేశాననే దానిపై రాహుల్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల తాను మాట్లాడాల్సి వచ్చిందని.. తనకు 10 నిమిషాలు సమయమిచ్చి, తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన రాహుల్‌.. అంతా ఓ కుటుంబంలా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. రాహుల్‌ చెప్పిన మాటతో తాను సంతృప్తి చెందానని, గతంలో తాను మాట్లాడిన విషయాలన్నీ మర్చిపోయానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు 
పార్టీలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ నెలకొందని.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని భేటీ సందర్భంగా పలువురు నేతలు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా తాను చూసుకుంటానని చెప్పారు. పార్టీ అనుమతి లేకుండా టికెట్లను ప్రకటిస్తున్నారని, అలా జరగవద్దని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొనగా.. అలా టికెట్లు ప్రకటించడం సరైంది కాదని, భవిష్యత్తులో అలా జరగొద్దని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వానికి రాహుల్‌ సూచించినట్టు తెలిసింది.

ఇక గత ఎన్నికల సందర్భంగా పొత్తుల పేరుతో చివరి వరకూ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేకపోయామని, టికెట్లు వచ్చిన వారు సరిగా ప్రచారం చేసుకోలేకపోయారని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించినట్టు సమాచారం. ఆరు నెలలు, ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటిస్తే మంచిదని కూడా ఆయన కోరగా.. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే అంశంపై కసరత్తు చేద్దామని రాహుల్‌ చెప్పినట్టు తెలిసింది.

ఇక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్రస్థాయిలో ఓ స్క్రీనింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పీఏసీకి అధికారం ఇవ్వడమా, లేక కొత్త కమిటీ ఏర్పాటు చేయడమా అన్నదానిపై చర్చిద్దామనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. 

రాహుల్‌తో భేటీ అయిన నేతలు వీరే 
రాహుల్‌ గాంధీతో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య, సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీహెచ్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, ఎం.కోదండరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కూడా హాజరయ్యారు.

మరిన్ని వార్తలు