తెలంగాణకు రాహుల్‌గాంధీ రాక

6 Apr, 2022 03:51 IST|Sakshi

28న వరంగల్‌ రైతు బహిరంగసభకు హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేత 

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన తేదీలు దాదాపు ఖరారయ్యాయి. ఈ నెల 27–29 మధ్య రెండు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేందుకు ఏఐసీసీ కార్యాలయ వర్గాల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 28న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిర్వహించే ‘రైతు బహిరంగసభ’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోగానీ, ములుగు నియోజకవర్గంలోగానీ ఈ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సభకు ముందు రోజున, లేదంటే సభ తర్వాతి రోజున రాహుల్‌గాంధీ ఒకరోజు హైదరాబాద్‌లో ఉండనున్నారు. ఈ నెల 27న లేదా 29న గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో రాహుల్‌ భేటీ కానున్నారు. టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో కూడా సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు చెపుతున్నాయి.

డీసీసీల అధ్యక్షులు, డిజిటల్‌ సభ్యత్వ నమోదులో క్రియాశీలంగా పనిచేసిన ఎన్‌రోలర్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించనున్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో కూడా రాహుల్‌గాంధీ సమావేశమయ్యేలా టీపీసీసీ షెడ్యూల్‌ రూపొందిస్తోంది. తద్వారా పార్టీలోని అన్నిస్థాయిల నేతలతో రాహుల్‌ మాట్లాడినట్టు ఉం టుందని, ఇదే స్ఫూర్తితో పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులమవుతామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.

సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రనేతలు రాహుల్‌ను తెలంగాణకు ఆహ్వానించారు. ఈ నెల 25–30 వరకు ఒకటి లేదా రెండు రోజులపాటు రాష్ట్రానికి రావాలని ఆయన్ను కోరారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున తెలంగాణకు వస్తారని, వారం రోజుల్లోపు షెడ్యూల్‌ కూడా ఖరారవుతుందని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు