Hyderabad: నగరానికి రాహుల్‌ జోడో యాత్ర.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా.. 

1 Nov, 2022 10:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర నేడు నగరంలో అడుగుపెట్టనుంది. రెండు రోజులపాటు 60 కిలోమీటర్ల యాత్ర కొనసాగనుంది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు నగర శివారులోని శంషాబాద్‌ మాతా టెంపుల్‌ నుంచి నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు ఆరాంఘర్‌ మీదుగా తాడ్‌బండ్‌ సమీపంలోని లెజెండ్‌ ప్యాలెస్‌కు చేరుకుంటుంది. అక్కడ 10.30 గంటలకు అల్పాహారం అనంతరం రాహుల్‌ విరామం తీసుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు పురానాపూల్‌ వద్ద ప్రారంభమయ్యే పాదయాత్ర హుస్సేనీ ఆలం, లాడ్‌ బజార్‌ మీదుగా 4.30 గంటలకు చార్మినార్‌కు చేరుకుంటుంది. అక్కడ రాజీవ్‌ గాంధీ సద్భావనా యాత్ర స్మారక స్తూపంపై జాతీయ పతాకాన్ని రాహుల్‌ గాంధీ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభయ్యే పాదయాత్ర గుల్జార్‌ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్‌ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్‌ గార్డెన్, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్, ఎన్టీఆర్‌ గార్డెన్‌ మీదుగా 7 గంటలకు నెక్లెస్‌ రోడ్డుకు చేరుకుంటుంది. 

ప్రత్యేక ఆకర్షణగా కళారూపాలు 
భారత్‌ జోడో పాదయాత్రలో తెలంగాణ సంస్కృతి  కళా రూపాలు ఆకర్షణగా నిలవనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, సదర్‌ విన్యాసాలు, పీర్లు, తోలుబొమ్మలు, బాజా భజంత్రీలు, మంగళ హారతులు, జానపద కళా విన్యాసాలు ప్రదర్శించనున్నారు. పాదయాత్ర పొడవునా.. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక కళా బృందాలను ఏర్పాటు చేసి ప్రదర్శన నిర్వహించనున్నారు.  పాదయాత్రకు అడుగడుగునా స్వాగత తోరణాలు  ఏర్పాట్లు పూర్తి చేశారు.  

శ్రేణుల్లో జోష్‌.. 
భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ వస్తుండటంతో కాంగ్రెస్‌ శ్రేణులు జోష్‌ మీద ఉన్నాయి. నగరానికి ఆయన ఆరు నెలల వ్యవధిలో రెండోసారి రానుండటంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అప్పట్లో వరంగల్‌ సభ మరుసటి రోజు చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించారు. రోజంతా నగరంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలిగించారు. తాజాగా రాహుల్‌ పాదయాత్ర పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. సాధారణ ఎన్నికలు  సమీపిస్తున్న తరుణంలో నగరం మీదుగా కొనసాగే జోడోయాత్ర పార్టీకి జవసత్వాలు నింపగలదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  
చదవండి: కావాలనే నా మాటలు వక్రీకరించారు.. హైకోర్టుకు రాజాసింగ్‌ నివేదన

పూర్వవైభవమే లక్ష్యంగా.. 
నగరంలో కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం వరుస ఓటములతో కాంగ్రెస్‌ పార్టీ కుదేలైంది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో చట్టసభలకు ఎన్నికైన వారు సైతం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభవం చవిచూసిన పార్టీకి నగర అధ్యక్షుడు రాజీనామాతో రెండేళ్లుగా చుక్కాని లేని నావగా పరిస్థితి కొనసాగుతోంది. ఈ తరుణంలో రాహుల్‌ జోడో యాత్ర కేడర్‌లో నూతనోత్తేజం నింపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 

కార్నర్‌ మీటింగ్‌లో ఖర్గే 
నెక్లెస్‌ రోడ్‌లో జరిగే కూడలి సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా ఆయన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీతో పాటు  పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు నెక్లెస్‌రోడ్‌ కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా.. 
భారత్‌ జూడో యాత్ర  సందర్భంగా మంగళవారం పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పాదయాత్ర కొనసాగే ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. పురానాపుల్, ముసబౌలి, లాడ్‌ బజార్, చార్మినార్‌ మీదుగా అఫ్జల్‌ గంజ్, మొజంజాహి మార్కెట్, గాంధీ భవన్, పోలీస్‌ కంట్రోల్‌ రూం, రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఐమాక్స్‌ మీదుగా పాదయాత్ర కొనసాగనుండటంతో మూడు కిలో మీటర్ల రేడియస్‌లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తారు. నెక్లెస్‌ రోడ్లులో కార్నర్‌ మీటింగ్‌ను పురస్కరించుకొని పీపుల్స్‌ ప్లాజా, సంజీవయ్య పార్క్, వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.  

ఎమర్జెన్సీ, అంబులెన్సులకే అనుమతి: ‘భారత్‌ జోడో’ యాత్ర సందర్భంగా మంగళవారం నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం రాత్రి ఆయన ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. ఆరాంఘర్, పురానాపూల్‌ జంక్షన్, ముసబౌలి, లాడ్‌బజార్, చార్మినార్, నయాపూల్, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, గాందీభవన్, నాంపల్లి, పోలీసు కంట్రోల్‌రూమ్, రవీంద్రభారతి, ఆర్‌బీఐ రోడ్డు నుంచి తెలుగు తల్లి ఫ్లైవర్‌ లెఫ్ట్‌ నుంచి ఐమాక్స్‌ రోటరీ వరకు యాత్ర సాగుతుంది.

ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కార్నర్‌ మీటింగ్‌ ఉంటుంది. ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులకు సైతం అనుమతి లేదని రంగనాథ్‌ స్పష్టంచేశారు. ఉస్మానియా, కేర్‌ ఆసుపత్రులకు (నాంపల్లి) ఎమర్జెన్సీగా వెళ్లే వారు ముందస్తుగా తమకు సమాచారం అందిస్తే ప్రత్యేక, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తామన్నారు. అంబులెన్స్‌కు ప్రత్యేక రూట్‌ ఇస్తామన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయా రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు