Raikal Toll Plaza: పెరిగిన టోల్‌ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!

1 Sep, 2021 08:13 IST|Sakshi

షాద్‌నగర్‌ రాయికల్‌ టోల్‌ ప్లాజా ధరల పెంపు

నేటినుంచి అమలులోకి రానున్న కొత్త చార్జీలు

నెలవారీ పాసులపైనా అదనపు వసూళ్లు

ఆందోళనలో వాహనదారులు, ప్రయాణికులు

సాక్షి, షాద్‌నగర్‌: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్‌ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్‌ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి.  

ఏటా పెంపు.. 
రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్‌లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ శివారులో నిర్మించిన టోల్‌ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్‌ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్‌ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. 
చదవండి: ఇక్కడ బస్టాప్‌ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు!

పెరగనున్న పాసుల రుసుము 
టోల్‌ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్‌ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్‌ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్‌ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. 

ఈ సారి పెంచేశారు  
గతేడాది కారు, ప్యాసింజర్‌ వ్యాన్‌లతో పాటుగా, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు టోల్‌ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్‌ వ్యాన్, లైట్‌ కమర్షియల్‌ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్‌ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి.   

పెరగనున్న ఆదాయం 
షాద్‌నగర్‌ సమీపంలోని రాయికల్‌ టోల్‌ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్‌ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్‌ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది.

వాహనం వెళ్లేందుకు రానుపోను
 (కొత్త చార్జీలు)
కారు, జీపు ప్యాసింజర్‌ వ్యాన్‌
 రూ.70    రూ.105 
లైట్‌ కమర్షియల్, మినీ బస్‌  రూ.125  రూ.185 
ట్రక్కు, బస్సు రూ.245   రూ.370 
మల్టియాక్సిల్‌ వాహనాలు   రూ.395  రూ.595

 భారం మోపడం సరికాదు 
ఏటా టోల్‌ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది.    
– సయ్యద్‌ సాధిక్, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, షాద్‌నగర్‌ 

మరిన్ని వార్తలు