రాష్ట్రానికి మరో రైల్వే లైను

22 Jan, 2021 09:00 IST|Sakshi

పటాన్‌చెరు–మెదక్‌ మార్గంపై దక్షిణ మధ్య రైల్వే సర్వే పూర్తి 

రూ.1,764 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే బోర్డుకు నివేదిక 

ఈ ప్రతిపాదన రైల్వే బ్లూ బుక్‌లో నమోదు 

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే పట్టాలెక్కే సూచన

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే మరో రైల్వే ప్రాజెక్టు కల సాకారం కానుంది. సగం నిధులు భరించేందుకు ముందుకొస్తే కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్రం రెండేళ్ల కిందటే సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మనోహరాబాద్‌–పెద్దపల్లి ప్రాజెక్టు ఇలాగే పట్టాలెక్కుతోంది. ఇప్పుడు అదే తరహాలో మరో కీలక ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. పటాన్‌చెరు–సంగారెడ్డి–జోగిపేట–మెదక్‌ లైన్‌కు సంబంధించి తాజాగా దక్షిణ మధ్య రైల్వే రీకనైసెన్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ సర్వే పూర్తి చేసి రూ.1,764.92 కోట్ల అంచనాతో రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనికి వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కితే ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు అవకాశం దక్కుతుంది. 

ఎంతో కీలకం.. 
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పరిశీలిస్తే రైల్వే లైన్లలో మెదక్‌ జిల్లా వెనుకబడి ఉంది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడల్లో ఒకటైన పటాన్‌చెరుతో అనుసంధానిస్తూ రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డిని కలుపుకొంటూ మెదక్‌ వరకు దీన్ని నిర్మిస్తే ఉత్తర–దక్షిణ భారత్‌లను జోడించే ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. దీంతో రైల్వే ట్రాఫిక్‌ కూడా తగ్గనుంది. ఇందుకోసం జోగిపేటకు చెందిన సీనియర్‌ నేత గంగా జోగినాథ్‌ రైల్వే లైన్‌ సాధన సమితి పేరిట ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ప్రధాని మొదలు దక్షిణ మధ్య రైల్వే జీఎం వరకు అందరినీ కలసి విజ్ఞప్తి చేశారు. చివరకు 2018–19 బడ్జెట్‌లో దీన్ని పరిశీలించేందుకు రైల్వే మంత్రి సమ్మతిస్తూ సర్వేకు ఆదేశించారు. నాటి రైల్వే బడ్జెట్‌ బ్లూ బుక్‌లో దీనికి చోటు దక్కింది. ఆమేరకు దక్షిణ మధ్య రైల్వే సర్వే పూర్తి చేసి గత డిసెంబర్‌ 31న రైల్వే బోర్డుకు ప్రతిపాదించింది.  

పింక్‌ బుక్‌లో చోటు దక్కితేనే.. 
రైల్వే బడ్జెట్‌ సమయంలో రెండు పుస్తకాలుంటాయి. ఫైనల్‌ అయిన ప్రాజెక్టుల వివరాలు పింక్‌ బుక్‌లో, తాత్కాలిక ప్రాజెక్టుల వివరాలు బ్లూ బుక్‌లో ఉంటాయి. పింక్‌ బుక్‌లో చోటు దక్కినవి ఆలస్యమైనా ఎప్పటికో అప్పటికి పట్టాలెక్కుతాయి. బ్లూ బుక్‌లోని ప్రాజెక్టులు రైల్వే బోర్డు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు పటాన్‌చెరు–మెదక్‌కు సంబంధించిన 95 కి.మీ. ప్రాజెక్టు బ్లూబుక్‌లో ఉంది. వచ్చే బడ్జెట్‌లో అది పింక్‌ బుక్‌లోకి మారాల్సి ఉంది.  

ఖర్చు భరించేందుకు ముందుకొస్తే.. 
రాష్ట్రప్రభుత్వం 50 శాతం ఖర్చు భరించేందుకు ముందుకొస్తే రైల్వే ముందడుగు వేస్తుంది. అది కూడా సాధ్యం అని భావిస్తేనే పట్టాలెక్కుతుంది. లేదంటే రాష్ట్రప్రభుత్వం మరింత ఖర్చు భరించేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు రైల్వేకు సమాచారం ఇస్తే ఫలితం కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. 

ప్రతిపాదిత లైను 
వట్టినాగులపల్లి – చేరియాల్‌ – సంగారెడ్డి – కోర్పోల్‌ – సాయిబాన్‌పేట – జోగిపేట – చిట్కుల్‌ – కోర్పాక్‌ – పొడ్చనపల్లి– ఘన్‌పూర్‌ – మెదక్‌ల మీదుగా కొనసాగుతుంది.  
 

మరిన్ని వార్తలు