రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 706 రోజుల తర్వాత..

1 Mar, 2022 20:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. 2020 మార్చి 24 కోవిడ్‌ తొలి లాక్‌డౌన్‌ వేళ నిలిచిన విషయం తెలిసిందే. రైల్వేచరిత్రలో ఇంత సుదీర్ఘకాలం రైళ్లు స్తంభించిన సందర్భం లేదు. కోవిడ్‌ వల్ల తొలిసారి ఆ పరిస్థితి ఎదురైంది. కోవిడ్‌ ఆంక్షలను తొలగించేకొద్దీ విడతలవారీగా రైళ్లను తిరిగి పునరుద్ధరించినా, ప్యాసింజర్‌ రైళ్లకు పచ్చజెండా ఊపలేదు. 706 రోజుల తర్వాత అన్‌రిజర్వ్‌డ్‌ ప్రయాణాలకు అనుమతినిస్తూ, కోవిడ్‌ ముందు ఉన్న తరహాలో ప్యాసింజర్‌ రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు రైల్వేబోర్డు అనుమతించింది. 

కోవిడ్‌ ప్రబలుతుందని...
కోవిడ్‌ మొదటిదశ తీవ్రత తగ్గిన తర్వాత మూడు నెలలకాలంలో 80% ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పట్టాలెక్కించారు. పండగల కోసం కొన్ని స్పెషల్‌ రైళ్లు నడిపించారు. రెండోదశ లాక్‌డౌన్‌తో మళ్లీ రైళ్లకు బ్రేక్‌పడింది. మళ్లీ తొందరగానే ఎక్స్‌ప్రెస్, స్పెషల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించారు. కానీ, ఎంత రద్దీ పెరిగినా ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించలేదు. చివరకు స్టేషన్లకు వచ్చే రద్దీని నిలువరించలేక తప్పని పరిస్థితిలో కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభించినా, వాటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగానే నడిపారు. అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు జారీ చేస్తే బోగీల్లో రద్దీ పెరిగి కోవిడ్‌ ప్రబలుతుందని అధికారులు పేర్కొంటూ వచ్చారు. 

చదవండి: (ఆ మానవ మృగాన్ని అరెస్ట్‌ చేయకపోవడం దారుణం: బండి సంజయ్‌)

ఇదీ అసలు కారణం...
దక్షిణమధ్య రైల్వేలో 230 ప్యాసింజర్‌ రైళ్లు ఉన్నాయి. రోజుకు సగటును పదిన్నర లక్షల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తే, అందులో 8 లక్షలమంది ప్యాసింజర్‌ రైళ్లలోనే తిరుగుతారు. కానీ, ప్యాసింజర్‌ రైళ్ల టికెట్‌ ధర నామమాత్రంగా ఉండటంతో వాటి ద్వారా భారీ నష్టాలు వచ్చిపడుతున్నాయి. ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణవ్యయంలో 20 శాతం మాత్రమే టికెట్‌ ద్వారా తిరిగి వసూలవుతుంది. అంటే, 80 శాతం నష్టాలేనన్నమాట.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా కలుపుకుంటే, మొత్తం నిర్వహణ వ్యయంలో 65 శాతం తిరిగి వసూలవుతాయి. దీంతో వాటిని నడిపే విషయంలో అధికారులు ఆసక్తి చూపలేదన్న అభిప్రాయముంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మొత్తం 230 ప్యాసింజర్‌ రైళ్లకుగాను 160 రైళ్లు ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల తరహాలో అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు లేకుండా నడుస్తున్నాయి. ఇవి ఇక కోవిడ్‌ ముందు ఉన్న ప్యాసింజర్‌ రైళ్ల తరహాలో నడుస్తాయి. ఇప్పటికీ ప్రారంభం కాకుండా ఉన్న మిగతా ప్యాసింజర్‌ రైళ్లను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు