సికింద్రాబాద్‌ రైల్వేక్వార్టర్స్‌కు బేరం 

4 Jan, 2021 09:31 IST|Sakshi

విలువైన స్థలాల లీజుకు సన్నాహాలు 

బిల్డ్‌ ఆపరేట్‌ పద్ధతిలో 99 ఏళ్ల లీజు 

మౌలాలీ, లాలాగూడ, మెట్టుగూడ స్థలాలు సైతం 

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే శాఖ ప్రైవేటీకరణ వైపు పరుగెడుతోంది. విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడం ద్వారా ఆదాయ వనరులను సమీకరించునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతోపాటు రైళ్లను కూడా ప్రైవేటీకరించేందుకు ఇప్పటికే బడా సంస్థలకు ఆహ్వానం పలికిన రైల్వేశాఖ.. తాజాగా ఖాళీ స్థలాల వినియోగంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే మౌలాలి, మెట్టుగూడ, లాలాగూడ, చిలకలగూడ, తదితర ప్రాంతాల్లోని సుమారు 10 ఎకరాల  విలువైన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. తాజాగా సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తాలోని  రైల్వే అధికారుల క్వార్టర్స్‌ను అప్పగించేందుకు రైల్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఏ) ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మొత్తం  స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.500 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. 

అందరి చూపు అటు వైపే... 
సంగీత్‌ చౌరస్తా నుంచి రైల్‌ నిలయం వైపు వెళ్లే దారిలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే అధికారుల క్వార్టర్స్‌ ఇవి. 40 మందికి పైగా అధికారులు ఈ క్వార్టర్స్‌లో నివాం ఉంటున్నారు. జనరల్‌ మేనేజర్, అదనపు జనరల్‌ మేనేజర్‌ మినహాయించి కనీసం పదేళ్లకు పైగా సీనియారిటీ కలిగిన  ఉన్నతస్థాయి అధికారులకు ఈ క్వార్టర్స్‌ కేటాయిస్తారు. ఈ ప్రాంగణంలో జీ+1 భవనాల్లో అన్ని వసతులు ఉంటాయి. ఇళ్లల్లో పని చేసేవాళ్లకు, డ్రైవర్‌లకు  ఔట్‌ హౌస్‌లు ఉంటాయి. రైల్‌నిలయంతో పాటే ఈ క్వార్టర్‌లను 1965–1970 మధ్య కట్టించారు. ఇటు రైల్‌నిలయం, అటు సంచాలన్‌భవన్, హైదరాబాద్‌ భవన్, లేఖాభవన్, తదితర రైల్వేకార్యాలయాలకు  అందుబాటులో ఉన్న ఈ  రైల్వే క్వార్టర్స్‌పై  ప్రస్తుతం ఆర్‌ఎల్‌డీఏ కన్ను పడింది.ప్రైమ్‌ ల్యాండ్‌ కావడంతో దీన్ని లీజుకు ఇవ్వడం ద్వారా ఎక్కువ ఆదాయం లభించగలదని అధికారులు  అంచనా వేస్తున్నారు.  

లీజుపైనే సందిగ్ధం... 
రెండేళ్ల  క్రితమే  రైల్వేస్థలాల లీజుకోసం  రైల్‌ లాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సన్నాహాలు చేపట్టింది. మొదట్లో 39 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని  భావించారు.కానీ నిర్మాణ సంస్థల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. దీంతో గడువును  99 ఏళ్లకు పెంచినట్లు సమాచారం.కానీ సాధారణంగా స్థలాలను పూర్తిగా కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టే  కార్పొరేట్‌ సంస్థలు లీజు స్థలాల పట్ల  ఎలా ఆసక్తి చూపుతారనిదే సందిగ్ధం.   

లీజుకు ఇలా....
రైళ్ల నిర్వహణ, సరుకు రవాణాపైనే కాకుండా రైల్వేస్థలాల నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించేందుకు రైల్వేశాఖ మూడేళ్ల  క్రితం రైల్‌లాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ  రైల్వేస్థలాలను గుర్తించి  బడా కార్పొరేట్‌ సంస్థలకు 99 ఏళ్ల వరకు లీజుకు ఇస్తుంది.

ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని  రైల్వేకార్టర్స్‌ స్థలంలో భారీ వ్యాపార,వాణిజ్య భవన సముదాయాలను నిర్మించి నిర్వహించేందుకు (బిల్డ్, ఆపరేట్‌) లీజుకు ఇవ్వనున్నారు. దీనిద్వారా రైల్వేకు రూ.150 కోట్లకు పైగా ఆదాయం రాబట్టవచ్చని అంచనా.   

మరిన్ని వార్తలు