కాజీపేట రైల్వే యూనిట్‌కు మోక్షం

16 Nov, 2022 00:51 IST|Sakshi

నేడు టెండర్లు తెరవనున్న రైల్వే శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాజీపేటలో వాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ వర్క్‌షాప్‌ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. రెండు దఫాలు టెండర్లు విఫలమైన తర్వాత మూడో ప్రయత్నంగా బుధవారం టెండర్లను తెరవబోతున్నారు. నిర్మాణసంస్థను గుర్తిస్తే.. సరిగ్గా రెండున్నరేళ్లలో యూనిట్‌ పని ప్రారంభించనుంది. రూ.383 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ నిర్మిస్తున్న ఈ యూనిట్‌లో నెలకు 250 వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేలా ఓవర్‌హాలింగ్‌ చేయనున్నారు.

2016లో రైల్వే శాఖ రూ.269 కోట్ల అంచనాతో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టు, ఎప్పుడో పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. దానికి కావాల్సిన 150 ఎకరాల భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవటం, ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాన్ని రైల్వేకు అప్పగించటంలో జాప్యం చేయటంతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. గతేడాదే ఆ భూమి రైల్వేకు అందటంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి యూనిట్‌ ఏర్పాటు పనులు ముమ్మరమయ్యాయి.  

మరిన్ని వార్తలు