ఆన్‌లైన్‌లో రైల్వే స్మార్ట్‌ కార్డుల రీచార్జ్‌ సదుపాయం  

7 Aug, 2021 15:35 IST|Sakshi

‘స్మార్ట్‌’గా రైల్వే జర్నీ 

యూటీఎస్‌ టికెట్ల కొనుగోలుకు స్మార్ట్‌ కార్డుల వినియోగం

డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్, యూపీఐ చెల్లింపులకు అవకాశం 

సాక్షి, సిటీబ్యూరో: స్మార్ట్‌కార్డు ద్వారా రైల్వే ప్రయాణం చేసేవారు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే రీచార్జ్‌ చేసుకోవచ్చు. వెబ్‌పోర్టల్‌లో యూటీఎస్‌ ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. డిజిటలైజేషన్‌లో భాగంగా రైల్వే మరో ముందడుగు వేసింది. ఇప్పటికే అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నించోవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌లను (ఏటీవీఎం) అందుబాటులోకి తెచ్చా రు. 

తాజాగా స్మార్ట్‌కార్డు రీచార్జ్‌ సదుపాయం కల్పించారు. సాధారణంగా ప్రయాణికులు తమ స్మార్ట్‌ కా ర్డులను రైల్వే బుకింగ్‌ కౌంటర్లలో మాత్రమే రీచార్జ్‌ చేసుకోవలసి రావడం వల్ల ప్రతిసారి రైల్వే బుకింగ్‌ కౌంటర్లకు రావలసి వస్తోంది. తాజాగా ఆన్‌లైన్‌ రీచార్జ్‌ సదుపాయం కల్పించడం వల్ల ఆ ఇబ్బంది తప్పినట్లయింది. ప్రస్తుత కోవిడ్‌ సమయంలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది.  

సేవలు ఇలా....
►ప్రయాణికులు https://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో మొదట నమోదు చేసుకోవాలి.
►మెనూలో ‘స్మార్ట్‌ కార్డు రీచార్జీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
►డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్‌ విధానాల ద్వారా చెల్లించవచ్చు. 
►అనంతరం ప్రయాణికులు ఏటీవీఎమ్‌ రీడర్‌ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘రీచార్జి స్మార్ట్‌ కార్డు’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాత ఏటీవీఎమ్‌లో ఆన్‌లైన్‌ రీచార్జీ వివరాలు వస్తాయి. ఈ మేరకు స్మార్టు కార్డులో రీచార్జ్‌ అవుతుంది. 
►ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను, ప్లాట్‌ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్‌ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చోవలసిన అవసరం ఉండదు.
►మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామ రుజువు, ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది.
►ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌ కార్డు రీచార్జి చేసుకోవాలి.
 

మరిన్ని వార్తలు