Special Trains: రీఫండ్‌కు రెడ్‌ సిగ్నల్‌, ఇదేందంటూ ప్రయాణికుల విస్మయం

23 Nov, 2021 08:28 IST|Sakshi

కోవిడ్‌ కాలంలో రిజర్వేషన్లకు అడ్వాన్స్‌ బుకింగ్‌

ప్రత్యేక రైళ్లు ప్రస్తుతం సాధారణ రైళ్లుగా మార్పు

అదనపు చార్జీలు తిరిగి ఇచ్చేందుకు రైల్వే ససేమిరా

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కాలంలో నడిపిన ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లుగా మార్చిన రైల్వే అదనపు చార్జీలు తిరిగి చెల్లించడంపై మాత్రం చేతులెత్తేసింది. ప్రత్యేక చార్జీలపై అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న వారికి అదనపు సొమ్మును తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు మరో రెండు, మూడు నెలల పాటు రెగ్యులర్‌ రైళ్లలో సైతం ప్రత్యేక చార్జీలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడ్వాన్స్‌ బుకింగ్‌లకు కూడా  రెగ్యులర్‌ చార్జీలను వర్తింపజేయాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా టికెట్‌ చార్జీలు పెంచినప్పుడల్లా అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రయాణికులపై కూడా వీటి పెంపు భారాన్ని విధించే  అధికారులు.. చార్జీలను తగ్గించినప్పుడు మాత్రం ఆ మేరకు  రీఫండ్‌ చేయకపోవడంతో ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

అడ్వాన్స్‌ బుకింగ్‌లపై అన్యాయం.. 
♦ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణానికి 120 రోజుల ముందే రిజర్వేషన్లు బుక్‌ చేసుకొనే సదుపాయం ఉంది. అంటే కనీసం మూడు నెలల ముందుగానే రిజర్వేషన్‌ సదుపాయాన్ని పొందవచ్చు. 
♦ప్రస్తుతం ప్రత్యేక రైళ్ల స్థానంలో అందుబాటులోకి వచ్చిన అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వచ్చే సంక్రాంతి వరకు ప్రయాణాలు నమోదయ్యాయి. లక్షలాది మంది ఇందుకోసం 30శాతం అదనంగా చెల్లించారు. కానీ ఇప్పుడు అదనపు సొమ్ము మాత్రం వారికి తిరిగి చెల్లించడం లేదు.  
♦సాధారణంగా చార్జీలు పెంచినప్పుడు పాత చార్జీలపై టికెట్‌ బుక్‌ చేసుకున్న వారి నుంచి ప్రయాణ సమయంలో పెంచినవాటిని రాబట్టుకుంటారు. ముందే చెల్లించిన ‘అదనపు’ చార్జీలు తిరిగి ఇవ్వడానికి మాత్రం నిరాకరించడం అన్యాయమని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

ఇదేం ‘ప్రత్యేకం’... 
♦ కోవిడ్‌  దృష్ట్యా గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో అన్ని రైళ్లను రద్దు చేశారు. ఎంఎంటీఎస్‌తో పాటు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపివేశారు. అత్యవర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాల మధ్య ‘రెగ్యులర్‌’ రైళ్లకే వాటి నంబర్లకు ప్రారంభంలో  ‘సున్నా’ను  చేర్చి ప్రత్యేక రైళ్లుగా నడిపారు.  
♦ హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు మొదట్లో 22 రైళ్లతో   ప్రారంభించి దశలవారీగా సుమారు 150కిపైగా రెగ్యులర్‌ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రూట్లలో రాకపోకలు సాగించే  ప్యాసింజర్‌ రైళ్లకు సైతం ‘సున్నా’ను చేర్చి  ‘స్పెషల్‌’గా నడిపారు.  
♦ఈ రైళ్లన్నింటిలోనూ సాధారణ చార్జీలపై మరో 30 శాతం వరకు అదనంగా పెంచారు. హైదరాబాద్‌ నుంచి విశాఖకు సాధారణ థర్డ్‌ ఏసీ చార్జీలు సుమారు రూ.600 వరకు ఉంటే ప్రత్యేక రైళ్లలో ఇది రూ.700 వరకు పెరిగింది.  
♦అన్ని రూట్లలోనూ చార్జీలు పెంచి నడిపారు. మరోవైపు దసరా, సంక్రాంతి వంటి పండగ రోజుల్లోనూ ప్రత్యేక దోపిడీ కొనసాగింది. కోవిడ్‌ కాలంలో పట్టాలెక్కించిన ఈ ‘ప్రత్యేక’ రైళ్లు ఇటీవల కాలం వరకు నడిచాయి. 
♦ తాజాగా ఈ రైళ్లన్నింటినీ వాటి నంబర్లకు ప్రారంభంలో ఉన్న ‘సున్నా’ను తొలగించి పాత పద్ధతిలో, పాత నంబర్లతో పునరుద్ధరించారు. 30  శాతం అదనపు చార్జీలను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం రెగ్యులర్‌ రైళ్లలో, పాత చార్జీలపై ప్రయాణం చేసే  సదుపాయం అందుబాటులోకి వచ్చింది.   

మరిన్ని వార్తలు