రైల్వే ‘యూజర్‌’ బాదుడు! 

19 Oct, 2021 03:05 IST|Sakshi

దేశవ్యాప్తంగా వెయ్యి స్టేషన్లలో త్వరలో యూజర్‌ చార్జీల వసూళ్లు

దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్‌లో అమలు

ఏసీ ప్రయాణికులకు వర్తింపు.. రూ. 30 వరకు విధించే చాన్స్‌

స్టేషన్‌ల పునరాభివృద్ధిలో భాగంగా విధింపు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలెక్కే ప్రయాణికులు ఇకపై యూజర్‌ చార్జీలు చెల్లించాల్సి రానుంది! దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో యూజర్‌ చార్జీల అమలుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు వెయ్యి స్టేషన్ల (ఏ–1)పునరాభివృద్ధిలో భాగంగా విమానాశ్రయాల తరహాలో ప్రయాణికుల నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయనున్నట్లు ఇటీవల స్పష్టం చేసిన రైల్వే బోర్డు... ఈ జాబితాలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను చేర్చింది.

అయితే తొలుత ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికే యూజర్‌ చార్జీలను పరిమితం చేయనుంది. ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులపై రూ. 30 వరకు, సెకండ్, థర్డ్‌ ఏసీ ప్రయాణికులపై రూ. 30లోపు ఈ చార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ బోగీలు, ప్యాసింజర్, ఎంఎంటీఎస్‌ రైళ్లను యూజర్‌ చార్జీల నుంచి మినహాయించనున్నారు.

ప్రస్తుతం ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏసీ బోగీల ప్రయాణికుల నుంచే చార్జీల వసూలును పరిమితం చేసినప్పటికీ దశలవారీగా స్లీపర్‌ క్లాస్, ఇతర కేటగిరీలకూ దీన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌ తరువాత క్రమంగా నాంపల్లి, కాచిగూడ, విజయవాడ, తిరుపతి స్టేషన్‌లకు యూజర్‌ చార్జీలను విస్తరించనున్నారు. వాస్తవానికి గతంలోనే రైల్వే బోర్డు ఈ ప్రతిపాదన చేసినప్పటికీ దేశంలో కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలు వాయిదాపడింది. 
వేగంగా ప్రైవేటీకరణ.... 
రోజుకు 150 రైళ్లు, 1.85 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌ స్టేష న్‌లో వాహనాల పార్కింగ్, టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి గదుల వంటి సేవలన్నీ పూర్తిగా ప్రైవేటు సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. 
► సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధి కోసం ఇండియన్‌ రైల్వేస్టేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ కరోనా దృష్ట్యా ఇన్వెస్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టులో ప్రతిష్టంభన నెలకొంది. 
► ఎయిర్‌పోర్టు తరహాలో స్టేషన్‌ రీ–డెవలప్‌మెంట్‌కు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఐఆర్‌ఎస్‌డీసీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో యూజర్‌ చార్జీల విధింపు అంశం ముందుకొచ్చింది. 

రూ. లక్షల్లో ఆదాయం...

 సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రైల్వేకు నిత్యం రూ. 1.65 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. 
ప్రతిరోజూ 80 వరకు నడిచే దూరప్రాంత రైళ్లలో సుమారు 30 వేల మంది ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నట్లు అంచనా. 
ఏసీ ప్రయాణికులపై సగటున రూ.25 చొప్పున యూజర్‌ చార్జీలు విధిస్తే రోజుకు రూ.7.5లక్షల ఆదాయం లభించనుంది.  
ప్రయాణికుల సేవల్లో నాణ్యతను పెంచేందుకు యూజర్‌ చార్జీలను వినియోగించనున్నట్లు అధికారులు చెప్పారు. 
స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా సుమారు 2.5 ఎకరాల స్థలంలో షాపింగ్‌ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, హోటల్స్‌ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.

మరిన్ని వార్తలు