గర్భిణులకు వాన కష్టాలు

23 Jul, 2021 04:30 IST|Sakshi

రైలు వంతెనపై నుంచి ఒకరు. వాగు మధ్యలో ఆటో ఆగి ఎడ్లబండిలో మరొకరు

ఆస్పత్రికి వెళ్లేందుకు వాగులు దాటలేక యాతన

అశ్వాపురం/నేరడిగొండ(బోథ్‌)/మోర్తాడ్‌ (బాల్కొండ): రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణులకు ఇది ప్రాణసంకటంగా మారింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఈ గ్రామానికి చెందిన గర్భిణి కుర్సం లక్ష్మిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అశ్వాపురం నుంచి వచ్చిన అంబు లెన్స్‌ వాగు అవతలే నిలిచిపోవడంతో సర్పంచ్‌ పాయం భద్రమ్మ దంపతులు, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, అంగన్‌వాడీ టీచర్లు వారికి అండగా నిలిచారు. వాగులోంచి వెళ్లడానికి వీలుపడక సమీపంలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి నడిపిస్తూ లక్ష్మిని వాగు దాటించి అంబులెన్స్‌లోకి చేర్చారు. అనంతరం ఆమెను అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు.

మంచంపై అంబులెన్స్‌ వరకు..
మరో ఘటనలో గురువారం కొందరు యువకులు ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను అంబులెన్స్‌ వరకు తరలించారు. నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు చెరువు నిండి రోడ్లన్నీ మునిగిపోగా స్థానిక కోళ్లఫారంలో పనిచేయడానికి వచ్చిన వలస కుటుంబానికి చెందిన గర్భిణిని సర్పంచ్‌ నవీన్‌ కొందరు యువకుల సాయంతో మంచంపై మోసుకుంటూ అరకిలోమీటర్‌ దూరం లో ఉన్న అంబులెన్స్‌ వరకు తరలించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నిజామాబాద్‌ జిల్లాలో గర్భిణిని మంచంపై అంబులెన్స్‌ వద్దకు తరలిస్తున్న తొర్తి యువకులు

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో మరో గర్భిణి ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న రాజులతండా గ్రామానికి చెందిన రబ్డే అనితను ఆస్పత్రికి తరలించే దారిలో బుద్దికొండ వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆమెను తీసుకెళ్తున్న ఆటో వాగు మధ్యలోనే ఆగింది. దాంతో కుటుంబసభ్యులు ఎడ్లబండి తెప్పించి వర్షంలోనే 5 కి.మీ. దూరంలోని బోథ్‌ మండలం పొచ్చర గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమెను ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం ప్రజలు యాతన పడుతున్నారు.

గొందిగూడెంలో వాగు ఇవతల గర్భిణితో కుటుంబసభ్యులు, ఆశ వర్కర్, అంగన్‌వాడీ టీచర్లు 

>
మరిన్ని వార్తలు