జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు

18 Aug, 2020 13:04 IST|Sakshi
జూరాల నుంచి దిగువకు పరుగులిడుతున్న వరద

ధరూరు (గద్వాల): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూఐర్‌ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో వదర నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల క్రస్టు గేట్లను పెంచుతూ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు 2లక్షల 90వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 39 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 2లక్షల 58వేల 032 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్టు గేట్ల ముందు నుంచి దిగువన ఉన్న శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులిడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  

కొనసాగుతున్న నెట్టెంపాడు 
ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, కుడి ద్వారా 357, ఎడమ కాల్వ ద్వారా 100 , సమాంతర కాల్వకు 300 క్యూసెక్కులు మొత్తం ప్రాజెక్టు నుంచి 2లక్షల 83వేల 183 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా 7.875 టీఎంసీలుగా ఉంది. 

ఆల్మట్టి వద్ద తగ్గిన వరద ఉధృతి 
ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో 114.23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 27వేల 582 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రాజెక్టు నుంచి 2లక్షల 255 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.4 టీఎంసీల నీరు ని ల్వ ఉంది. ఈ ప్రాజెక్టుకు లక్షా 78వేల 264 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి 2లక్షల 25వేల 291 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు