భారీ వర్షం; వరదల్లో నీటమునిగిన వాహనాలు

20 Oct, 2020 09:27 IST|Sakshi

వరుస వానలు, వరదలలో నీటమునిగిన వాహనాలు

గ్రేటర్‌లో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాల మునక 

కోవిడ్‌ నేపథ్యంలో భారీగా పెరిగిన వ్యక్తిగత వాహనాలు 

సాక్షి, సిటీబ్యూరో: వానల కారణంగా నీటమునిగిన వాహనాలకు మరమ్మతులు చేయించడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది.   బీమా సంస్థలు సకాలంలో గుర్తించి నష్టాన్ని అంచనా వేయకపోవడం వల్ల, మెకానిక్‌లపైన పెరిగిన ఒత్తిడి కారణంగా, సిటీలో విడిభాగాల కొరత ఏర్పడింది. దీంతో వేలాది వాహనాలు మరమ్మతులకు కూడా నోచుకోలేని పరిస్థితి నెలకొంది. బైక్‌లకు మాత్రం రెండు, మూడు రోజుల్లో సర్వీసింగ్‌ సేవలు లభిస్తుండగా కార్ల విషయంలో మాత్రం జాప్యం ఎక్కువగా ఉంది. కోవిడ్‌ కారణంగా నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. కానీ ప్రస్తుతం చాలా చోట్ల వాహనాలు నీటమునిగి వినియోగానికి పనికిరాకుండా పాడైపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చదవండి: విశ్వ నగరాలు.. శాస్త్రీయ విధానాలు

నగరంలోని మల్కాజిగిరి, అల్వాల్, సికింద్రాబాద్, పాతబస్తీ, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, ఈసీఐఎల్‌ తదితర ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలతో వేల కొద్దీ కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కోవిడ్‌ మహమ్మారి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ప్రజారవాణా స్తంభించడంతో నగరంలో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. రవాణాశాఖ అంచనాల మేరకు నగరంలో సుమారు 55 లక్షల వాహనాలు ఉన్నాయి. గత మూడు నెలల్లోనే 60 వేల ద్విచక్ర వాహనాలు, మరో 25 వేలకు పైగా కార్లు రోడ్డెక్కాయి. ఇప్పటికీ ఒక్క మెట్రో సర్వీసులు మినహా సిటీ బస్సులు పరిమితంగానే ఉండడం వల్ల, ఎంఎంటీఎస్‌ వంటివి లేకపోవడం వల్ల ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కసారిగా పోటెత్తిన వర్షాలు, వరదలతో  1500కు పైగా కాలనీలలో వరదబీభత్సం సృష్టించించింది. రహదారులు సైతం చెరువులను తలపించాయి. ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు నీటిపాలయ్యాయి. చదవండి: రాష్ట్రంలో పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు..

రూ.వేలల్లో భారం...
ప్రకృతి వైపరీత్యాలు, వరదల్లో చిక్కుకునిపోయి చెడిపోయినప్పుడు సదరు బీమా సంస్థల సమక్షంలోనే వాహనాలను బయటకు తీసి నష్టాన్ని అంచనా వేయవలసి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ స్తంభించింది. వాహనదారులే స్వయంగా బయటకు తీసి మెకానిక్‌ షెడ్‌లకు తరలిస్తున్నారు. బీమా సంస్థల అనుమతిలో జాప్యం కారణంగా షోరూమ్‌ మెకానిక్‌లకు తరలిస్తున్న వాటి సంఖ్య తక్కువగానే ఉంది. మరోవైపు కొన్ని సంస్థలు మాత్రం వినియోగదారులే ఖర్చులు భరించి బిల్లులు అందజేస్తే ఆ మొత్తాన్ని అందజేయనున్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం నీటమునిగిన కార్లలో ఎక్కువ శాత ఈసీఎం, సీజ్‌బాక్స్, సెంటర్‌ లాకింగ్‌ బాక్స్, ఎయిర్‌బ్యాగ్‌ మిడిల్, పవర్‌స్టీరింగ్‌ వంటివి దెబ్బతింటున్నాయి.  డాష్‌బోర్డు వరకు నీళ్లు చేరితే నష్టం ఎక్కువగానే ఉంటుంది. విడిభాగాల అవసరంఇంకా పెరుగుతుంది. సగటున ఒక్కో కారు రిపేర్‌ కోసం రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.  చదవండి: వణికిస్తున్న మీర్‌పేట్‌ చెరువు

బైక్‌లు తుప్పు పడితే కష్టమే... 
సైలెన్సర్‌లలోకి నీరు పోవడం వల్ల ఇంజన్‌ దెబ్బతింటుంది. ఎక్కువ రోజులు నీళ్లల్లో ఉంటే  విడిభాగాలు తుప్పు పట్టిపోతాయి. ప్రస్తుతం నీటమునిగిన బైక్‌లలో ఎక్కువ శాతం ఎయిర్‌ఫిల్టర్‌లు, పవర్‌కాయిల్స్, స్టార్టింగ్‌ కాయిల్స్‌ దెబ్బతింటున్నాయి. పిస్టన్, బేరింగ్స్‌ వంటివి చెడిపోతున్నాయి. బైక్‌ సర్వీసింగ్‌ ఖర్చు రూ.2500 నుంచి రూ.విడిభాగాల వినియోగం మేరకు రూ.5000 వరకు వస్తుంది.  

పూర్తిబీమా ఉంటేనే పరిహారం... 
నీటమునిగిన వాహనాల మరమ్మతుల కోసం చెల్లింపుల్లో జాప్యం ఉన్నప్పటికీ బీమా సంస్థలపైన ఒత్తిడి కూడా పెరిగింది. సాధారణంగా ప్రతి వాహనానికి పూర్తి బీమా ఉంటేనే  పరిహారం లభిస్తుంది.  థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌లకు ఇది వర్తించదు. వాహనానికి జరిగిన నష్టాన్ని బీమా సంస్థలు సర్వేయర్ల ద్వారా అంచనా వేసి నిర్ధారిస్తాయి.  
అప్పటి వరకు వాటిని ఇంజన్‌ స్టార్ట్‌ చేయకుండా నీటిలోంచి బయటకు తీసి పెట్టాలి. ఇంజన్‌ స్టార్ట్‌ చేసి బండి నడిపితే బీమా పరిహారం లభించదు. 

ఒక వర్షం.. వేయి సవాళ్లు 
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాలనూ చుట్టిముట్టిన వాన వెయ్యి సవాళ్లు కనబడేలా చేస్తోంది. నగరానికి వచ్చే దాదాపు అన్ని జాతీయ, స్టేట్‌ హైవేలు వరద నీటిలో చిక్కుకొని...కొన్ని మార్గాల్లో రహదారి కూడా పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా రెండుసార్లు కురిసిన భారీ వర్షం నగర రహదారుల దుస్థితిని తేటతెల్లం చేసింది. సిటీపై ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పుణ్యమా అని రవాణా మార్గం కొంతమెరుగుపడింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఓఆర్‌ఆర్‌కు అనుసంధానంగా ఇంకా నిర్మించాల్సిన రేడియల్‌ రోడ్లతో పాటు ప్రతిపాదిత స్పైక్‌ రోడ్ల నిర్మాణం ఆచరణరూపం దాలిస్తే రవాణా కనెక్టివిటీ బాగా ఉండేది. భారీ వర్షాల వంటి విపత్తులు సంభవించినప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ రహదారులు ఉపయోగపడే ఆస్కారముందని హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే వీటికి రూ.ఆరు వేల కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తేనే మెరుగైన రవాణా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

33కు అందుబాటులోకి  23 
ఇన్నర్‌ రింగ్‌–ఔటర్‌ రింగ్‌ రోడ్లకు అనుసంధానంగా 33 రేడియల్‌ రోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కొన్నేళ్ల క్రితం నిర్ణయించిన హెచ్‌ఎండీఏ అధికారులు జైకా రుణ సహాయంతో ఇప్పటివరకు 19 రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో నాలుగు ఆర్‌ అండ్‌ బీ అధికారులు నిర్మించారు. అంటే ఇప్పటివరకు 23 రేడియల్‌ రోడ్లు మాత్రమే పూర్తిస్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. నాగోల్‌ నుంచి ప్రతాపసింగారం వరకు రేడియల్‌ రోడ్డు నిర్మించే అంశాన్ని ప్రస్తుతం హెచ్‌ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షం ధాటికి ఆయా ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు వచ్చి వాహనదారులకు ఇబ్బందులు ఎదురుకావడంతో ఈ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.

ఇక మిగిలిన తొమ్మిది రేడియల్‌ రోడ్లకు భూసేకరణ అడ్డంకిగా ఉండడం, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండడం, కాలనీల మధ్య నుంచి వెళ్తుండడంతో వాటిని పట్టాలెక్కించలేదు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా సాఫీ జర్నీ కోసం మరిన్ని రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానంగా దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో స్పైక్‌ రహదారులు నిర్మించాలని ఆలోచించిన అధికారులు ఇప్పటివరకు ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే భారీ వర్షాలు పడినా వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఈ రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.ఆరు వేల కోట్ల వరకు వ్యయం అయ్యే అవకాశముందని అధికారులు చెబుతుండడంతో ఇవి అచరణ రూపంలోకి వస్తాయా అన్నది అనుమానమే.

మరిన్ని వార్తలు