Yellow, Orange, Red Alerts: ఎప్పుడు జారీ చేస్తారో తెలుసా?!

31 Aug, 2021 10:27 IST|Sakshi

దేశంలో వర్ష సూచన, వాతావరణ హెచ్చరికలకు సంబంధించి ఎల్లో, ఆరెంజ్, రెడ్‌ అలర్ట్‌లను జారీ చేస్తారు. వచ్చే 24 గంటల్లో పడే భారీ వర్షాలు, తుఫానులు, ఇతర తీవ్రమైన వాతావరణ పరిస్థితిని.. వర్షపాతం నమోదయ్యే అవకాశాన్ని బట్టి ఈ హెచ్చరికలు ఉంటాయి. ఇందులో గ్రీన్‌ అలర్ట్‌ అంటే ఎలాంటి ప్రమాదం లేదని అర్థం. మరి.. ఎల్లో, ఆరెంజ్‌, రెడ్‌ అలర్ట్‌ ఎలాంటి పరిస్థితుల్లో జారీ చేస్తారో తెలుసా?!

ఎల్లో అలర్ట్‌
ఆరు నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఎల్లో అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తారు. 

ఆరెంజ్‌ అలర్ట్‌
పది నుంచి 20 సెంమీటర్ల వర్షపాతం, 40–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి ఉంటే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని.. ఇబ్బందులేమైనా వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఈ అలర్ట్‌ సూచిస్తుంది. కాగా హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్న నేపథ్యంలో.. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

రెడ్‌ అలర్ట్‌
ఒక రకంగా చెప్పాలంటే కుండపోత వానలు, తుఫాను వంటి ప్రకృతి విపత్తును సూచించడానికి రెడ్‌ అలర్ట్‌ జారీ చేస్తారు. అంటే 20 సెంటీమీటర్లకు మించి వాన పడే అవకాశం ఉందని అర్థం. రెడ్‌ అలర్ట్‌ ఇస్తే.. విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.   

చదవండి: Telangana: జడివాన..మరో 3 రోజులు కుండపోతే..!

మరిన్ని వార్తలు