సిరులు కురిపించిన కురులు

22 Jan, 2021 14:20 IST|Sakshi

రాజన్నకు తలనీలాల ద్వారా 36 రోజుల్లోనే అరకోటికి పైగా ఆదాయం 

కాంట్రాక్టర్ల మధ్య పెరిగిన పోటీ  

వేములవాడ: ఎములాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే కురులతో సిరులు కురిశాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో గత మార్చి 22 నుంచి మూసివేసి ఉంచిన కల్యాణకట్ట కోవిడ్‌–19 నిబంధనల మేరకు ప్రభుత్వం అన్‌లాక్‌ ప్రకటించిన నేపథ్యంలో నవంబర్‌ 25న ప్రారంభించారు. దీంతో 36 రోజుల్లో కల్యాణ కట్టలో సేకరించిన తలనీలాలకు కాంట్రాక్టర్ల మధ్య పెరిగిన పోటీతో భారీగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 20న స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌లో జరిగిన బహిరంగ వేలంపాటలో కాంట్రాక్టర్లు పోటాపోటీగా కిలో ఒక్కంటికి రూ.16,050 వరకు వేలం పాడారు. దీంతో రాజన్నకు సిరులు కురిశాయి.   

పెరిగిన పోటీ..
రాజన్న ఆలయ కల్యాణకట్ట నుంచి పోగుచేసిన తలనీలాలకు నిర్వహించిన బహిరంగ వేలం కమ్‌ సీల్డ్‌ టెండర్లలో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కాంట్రాక్టర్ల మధ్య తీవ్రపోటీ పెరిగింది. 14 మంది కాంట్రాక్టర్లు బహిరంగ వేలంపాటలో హాజరు కాగా, ఇద్దరు బాక్స్‌ టెండర్, ఒకరు ఆన్‌లైన్‌ టెండర్‌ వేశారు. దీంతో బహిరంగ వేలంపాటలో హెచ్చుపాటదారుడైన హిందూపురానికి చెందిన సుమిత్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కిలో ఒక్కంటికి రూ.16,050కు సొంతం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన దురై ఎంటర్‌ ప్రైజెస్, హిందూపురానికి చెందిన సుమిత్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ మధ్య వేలంపాట జోరుగా సాగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా రాజన్నకు మాత్రం 36 రోజుల్లో సేకరించిన తలనీలాలకు భారీగా ఆదాయం వచ్చి చేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం ఎక్కువే
కల్యాణకట్టలో నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 31 వరకు మేము సేకరించిన తలనీలాలకు నిర్వహించిన టెండర్‌ ద్వారా ఆదాయం ఎక్కువగానే వచ్చింది. చాలామంది కాంట్రాక్టర్లు తరలివచ్చారు. అంతేకాకుండా ఆన్‌లైన్, బాక్స్‌ టెండర్లు కూడా దాఖలయ్యాయి. దీంతో బహిరంగ వేలంపాటలో హెచ్చుపాటదారుడైన సుమిత్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు కిలో ఒక్కంటికి రూ.16,050 చొప్పున తూకం వేసి అప్పగిస్తాం. మొత్తంగా రూ.అరకోటికి పైగా ఆదాయం రావచ్చని భావిస్తున్నాం.  – కృష్ణప్రసాద్, ఆలయ ఈవో

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు