సిరిసిల్ల టౌన్‌ ఎస్సై ఉపేందర్‌రెడ్డి మృతి

4 Oct, 2022 07:32 IST|Sakshi
ఉపేందర్‌రెడ్డి (ఫైల్‌)

సాక్షి, సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై ఉపేందర్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలంలోని ఒబులాపూర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి 28 ఆగస్టు 1990న కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. పదోన్నతులతో ఎస్సై స్థాయికి ఎదిగారు. వేములవాడ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని అద్దె ఇంట్లో భార్య విజయతో ఉంటున్నారు. ఆయన రామగుండం, ఆదిలాబాద్‌ జిల్లాలో హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పని చేశారు.

2019లో ఎస్సైగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. 8 నెలల క్రితం బదిలీపై డీపీవో కార్యాలయానికి వచ్చారు. ఉపేందర్‌రెడ్డి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవల అవి ఎక్కువవడంతో పది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా వారికి పెళ్లిళ్లు జరిపించారు. ఎస్సై మృతికి ఎస్పీ రాహుల్‌హెగ్డే సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు