తహశీల్దార్‌ ఆఫీస్‌ గేటుకు తాళిబొట్టును వేలాడదీసి మహిళ నిరసన

1 Jul, 2021 07:56 IST|Sakshi

తమ భూమిని ఇతరులకు పట్టా చేశారని ఆవేదన 

సాక్షి, రుద్రంగి (వేములవాడ): తన పేరిట భూమి పట్టా చేయాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోక పోవడంతో ఆ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. మెడలో ఉండాల్సిన తాళిబొట్టును తీసి తహసీల్దార్‌ ఆఫీసు గుమ్మానికి తగిలించి అక్కడే బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ మామ పొలాస రాజలింగం పేరిట సర్వేనంబర్‌ 130/14లో రెండెకరాల వ్యవసాయ పొలం ఉండేది. మంగ భర్త పదేళ్ల క్రితం గల్ఫ్‌ వెళ్లి, తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ బతుకుతోంది.

మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని ఆమెకు తెలియకుండానే ఆమె పెద్దమామ తన మనుమని పేరిట పట్టా మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమి పట్టా మార్చాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. బుధవారం మరోసారి తహసీల్దార్‌ ఆఫీసుకు వచ్చిన మంగ.. తన దగ్గర పైసలు లేవని, తాళిబొట్టును తీసుకొని పట్టా మార్చాలంటూ రోదిస్తూ కోరింది. తనకు న్యాయం చేసే వరకు వెళ్లేది లేదని బైఠాయించింది. పోలీ సులు వచ్చి సర్ది చెప్పారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులపై, పట్టా చేసుకొ ని భూమిని చదును చేసుకుంటున్న వ్యక్తులపై ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్నారు.   

కావాలనే పట్టా మార్చిండ్రు  
మా మామ పొలాస రాజలింగం చనిపోయే వరకు ఆ భూమి అతని పేరు మీదనే ఉంది. మామ 2013లో చనిపోయిండు. 2014–15 వరకు మామ పేరు మీదనే ఉంది. అప్పుడున్న తహసీల్దార్, వీఆర్వో లంచం తీసుకొని మా పెద్దమామ మనుమని పేరు మీద పట్టా చేసిండ్రు. విచారణ కూడా చేయకుండానే పట్టా మార్చిండ్రు. నేను అన్ని పత్రాలు ఇచ్చినా పట్టా చేయడానికి ఇబ్బందులు పెడుతుండ్రు.  
పొలాస మంగ, బాధితురాలు 

పట్టా మేం చేయలేదు 
మంగ భూమి పట్టాను మేము మార్చలేదు. మా కంటే ముందు ఉన్న తహసీల్దార్‌ పట్టా మార్పు చేశారని పొలాస మంగ ఆరోపిస్తోంది. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 
– మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్, రుద్రంగి  

మరిన్ని వార్తలు