సిరిసిల్ల: షాలిని-జానీ ప్రేమపెళ్లి వ్యవహారం సుఖాంతం?!

20 Dec, 2022 21:09 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో సంచలనంగా మారిన యువతి కిడ్నాప్ వ్యవహారం.. ఆపై ఇష్టపూర్వక వివాహంగా మారి ట్విస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని షాలిని ప్రకటించడం, ఆమెను బెదిరించి ఉంటారన్న తల్లిదండ్రుల అనుమానాలతో కేసు ఉత్కంఠగా మారింది. అయితే.. సాయంత్రం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేను కలిసిన నవ దంపతులు.. రక్షణ కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో.. ఆ జంటకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన ఆయన.. పెద్దలను పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం. 

తన ఇష్ట ప్రకారమే తన ప్రియుడితో వెళ్లానని తెలిపిన ఎస్పీకి షాలిని వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాదు నాలుగైదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే.. షాలిని అప్పటికి మైనర్‌ కావడంతో.. వివాహం చెల్లదని చెబుతూ పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. ఈ క్రమంలో.. మైనార్టీ తీరాక వివాహం చేసుకుందామని షాలినితో చెప్పాడు జ్ఞానేశ్వర్‌. త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని ఆమెకు ముందుగానే సమాచారం ఇచ్చాడు. 

అయితే.. షాలిని గుడికి వెళ్తుందనే సమాచారం జానీకి ముందే తెలుసు!. అందుకే ఆమెను తీసుకెళ్లే యత్నం చేశాడట. కానీ.. ముఖానికి అడ్డుగా కర్చీఫ్ ఉండడంతో ఎవరో అనుకుని ఆమె భయపడి ప్రతిఘటించినట్లు షాలిని వెల్లడించింది. తీరా కారులోకి వెళ్లాక.. అది అతనే అని తెలిసి వెంట వెళ్లినట్లు చెప్పింది. తమ ఇష్టప్రకారమే వివాహం జరిగిందని, తల్లిదండ్రుల నుంచి ప్రాణ భయం ఉందని రక్షణ కల్పించాలని ఆ నవ దంపతులు జిల్లా ఎస్పీని కోరారు. దీంతో.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కిడ్నాప్ గురైందనుకున్న యువతి షాలిని.. పెళ్లి చేసుకొని వీడియో రికార్డులను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. 

మా బిడ్డను మా ముందు నిలబెట్టండి
ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నానని చెప్తున్న షాలిని వ్యవహారంలో తమ గోడును కూడా వినాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బలవంతంగా షాలినిని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుని ఉంటాడని, తమ బిడ్డను తమ ముందు నిలబెడితే అసలు విషయం తేలుతుందని షాలిని తల్లిదండ్రులు వాపోతున్నారు.భయపెట్టి లేదంటే తమను చంపుతామని బెదిరించి.. తమ కూతురితో జానీ అలా చెప్పించి ఉంటారని షాలిని తల్లిదండ్రులు చంద్రయ్య-పద్మ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు