Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్‌ 

21 Jul, 2022 01:36 IST|Sakshi
వరద నష్టంపై సమీక్షలో రజత్‌కుమార్‌ 

కాళేశ్వరం ప్రాజెక్టుకు వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్‌కుమార్‌ 

ఈ ఖర్చునూ నిర్మాణ సంస్థలే భరిస్తాయి.. 

సెప్టెంబర్‌లోగా పునరుద్ధరిస్తాం 

పోలవరంతో తెలంగాణలో లక్ష ఎకరాల ముంపు 

క్షుణ్నంగా అధ్యయనం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం స్పందించలేదని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్‌లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్‌లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్‌లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్‌కుమార్‌ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. 

ఎవరూ సరిగా అంచనా వేయలేదు 
వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్‌ బరస్ట్‌ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్‌లు నీటమునిగాయని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్‌ శాటిలైట్‌ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. 

పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు 
గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు.  

మరిన్ని వార్తలు