సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఒక జోన్‌..  ఏడు ఠాణాలు

27 Aug, 2022 16:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్‌ జోన్‌ ఏర్పాటు కానుంది.

ఇప్పటివరకు శంషాబాద్‌ జోన్‌ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్‌ జోన్‌గా.. అలాగే శంషాబాద్, షాద్‌నగర్‌ డివిజన్లు కలిపి శంషాబాద్‌ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్‌ జోన్‌ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్‌ జోన్‌లో కలపనున్నారు.

డివిజన్‌ స్థాయిలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (ఏసీపీ), జోన్‌ స్థాయిలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్‌ పునర్‌ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్‌ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. 

కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 
3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్‌ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్‌ పరిధిలోని జన్వాడ, శంకర్‌పల్లి స్టేషన్‌ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్‌ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు