TRS Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ..పెద్దల సభకు వెళ్లేదెవరో?!

18 May, 2022 01:20 IST|Sakshi

అధికార టీఆర్‌ఎస్‌కే దక్కనున్న మూడు సీట్లు 

నేడు అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ స్పష్టత 

రేపటితో ముగియనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు 

ఉప ఎన్నిక అభ్యర్థిగా దామోదర్‌రావు పేరు దాదాపు ఖరారు! 

మరో రెండు స్థానాలకు 24 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యసభ అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 119 మంది సభ్యులు ఉన్న తెలంగాణ శాసనసభలో టీఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేల బలం ఉండటంతో.. ఎన్నిక జరిగే మూడు రాజ్యసభ స్థానాలూ ఆ పార్టీకే ఏకగ్రీవంగా దక్కనున్నాయి.  

బండా ప్రకాశ్‌ రాజీనామాతో.. 
రాజ్యసభలో తెలంగాణ కోటాలో ఏర్పడిన ఖాళీకి సంబంధించిన ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ రాజీనామాతో ఈ ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ 19న ముగియనుంది. 2018 మార్చిలో టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్‌.. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు గత ఏడాది డిసెంబర్‌ 4న తన పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఎన్నిక జరిగే పక్షంలో ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. 

పూర్తికానున్న మరో ఇద్దరి పదవీ కాలం 
ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్‌ 21 నుంచి ఆగస్టు ఒకటో తేదీ మధ్యకాలంలో ఆరేళ్ల పదవీ కాల పరిమితి పూర్తి చేసుకుంటున్న రాజ్యసభ సభ్యుల స్థానంలో కొత్తవారిని ఎన్నుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. 15 రాష్ట్రాల నుంచి 57 మంది పదవీ కాలం పూర్తి కానుండగా, తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు ఈ జాబితాలో ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ వచ్చే నెల 21న తమ పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా వీరి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్‌ 3న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితిలో జూన్‌ 10న పోలింగ్‌ నిర్వహిస్తారు.  

ఆశావహుల ఎదురుచూపులు 
మరికొన్ని గంటల్లోనే రాజ్యసభ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ అధినేత ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులపై కూడా బుధవారం మధ్యాహ్నంలోగా స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అభ్యర్థుల ఎంపికపై ప్రకటన చేయకుండా, ఎంపికైన అభ్యర్థులకే నేరుగా సమాచారం అందిస్తామని కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. దీంతో ఎవరికి అవకాశం దక్కనుందనే అంశంపై ఆశావహ నేతలు ప్రగతిభవన్‌తో పాటు కేసీఆర్‌ సన్నిహిత వర్గాల వద్ద ఆరా తీస్తున్నారు.

పరిశీలనలో ఉన్న ‘పెద్దలు’ 
ఓసీ సామాజికవర్గం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికార పార్టీకి చెందిన దినపత్రిక ఎండీ దామోదర్‌రావు, ఓ ఫార్మా కంపెనీ అధినేత పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పీఎల్‌ శ్రీనివాస్, ఎస్టీ సామాజికవర్గం నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎస్సీ కోటాలో మోత్కుపల్లి నర్సింహులు పేర్లు ఆశావహుల జాబితాలో ప్రధానంగా ఉన్నాయి. వీరితో పాటు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. జాతీయ రాజకీయాల కోణంలో మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఉప ఎన్నిక అభ్యర్థిగా దామోదర్‌రావు పేరు దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.   

మరిన్ని వార్తలు