విద్యార్థుల మెస్‌ ఛార్జీలను వెంటనే పెంచాలి

25 Jan, 2023 01:40 IST|Sakshi
మాసబ్‌ట్యాంక్‌ బీసీ సంక్షేమ భవన్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఆర్‌.కృష్ణయ్య తదితరులు 

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌

విజయనగర్‌ కాలనీ: రాష్ట్రంలోని 8 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల పాఠశాలలు, కళాశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెరిగిన ధరల ప్రకారం పెంచాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. విద్యార్థుల మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, జి.అంజిల ఆధ్వర్యంలో మాసబ్‌ట్యాంక్‌ బీసీ సంక్షేమ భవన్‌ను ముట్టడించారు.

ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం నాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్‌ఛార్జీలు, స్కాల్‌షిప్‌లను నేడు పెరిగిన నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరల మేరకు పెంచాలన్నారు. ఉద్యోగుల జీతాలు రెండుసార్లు పెంచారని మంత్రులు, శాసన సభ్యుల జీతాలు మూడురేట్లు, వృద్ధాప్య పెన్షన్లు ఐదురేట్లు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల స్కాల్‌షిప్‌లు, మెస్‌ఛార్జీలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు.

కాలేజీ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ఛార్జీలను నెలకు రూ.1500 నుంచి రూ.3 వేలకు, పాఠశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ఛార్జీలను రూ.950 నుంచి రూ.2 వేలకు పెంచడంతో పాటు గత రెండేళ్లుగా చెల్లించాల్సిన ఫీజు బకాయిలు రూ.3500 కోట్లను వెంటనే చెల్లించాలని కోరారు. అనంతరం సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. జాతీయ నాయకులు గుజ్జకృష్ణ, పి.సుధాకర్, సి.రాజేందర్, గుజ్జ సత్యం, అనంతయ్య, పి.రాజ్‌కుమార్, నిఖిల్, భాస్కర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు