ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

11 Jun, 2022 07:13 IST|Sakshi

చార్మినార్‌ వద్ద ముస్లింల బైఠాయింపు

మెహదీపట్నంలో భారీ ర్యాలీ 

స్వల్ప ఉద్రిక్తత..లాఠీచార్జి 

చార్మినార్‌ / గోల్కొండ (హైదరాబాద్‌)/ తాండూరు టౌన్‌:  మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు శుక్రవారం ఆందోళనలకు దిగారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. చార్మినార్‌ సమీపంలోని మక్కా మసీదులో మధ్యాహ్నం సామూహిక ప్రార్థనలకు ఇరాన్‌ విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్‌ హుస్సేన్‌ అమేర్‌ అబ్దుల్లా హాజరయ్యారు.

దీంతో ముస్లింలు అత్యధిక సంఖ్యలో మసీదు వద్దకు చేరుకున్నారు. ఆయన మసీదు నుంచి వెళ్లిపోయిన వెంటనే ముస్లిం యువత యునానీ ఆస్పత్రి ప్రధాన రహదారిపైకి చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఐపీఎస్‌ అధికారులు చార్మినార్‌ వద్దకు చేరుకొని శాంతి భద్రతలను స్వయంగా పర్యవేక్షించారు. ఆందోళనకారులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

బీజేపీ నేతల చిత్రపటాల దహనం
మెహిదీపట్నం అజీజియా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నినాదాలు ఇస్తున్న వారిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇలావుండగా టోలిచౌకి పారామౌంట్‌ కాలనీ ఫయాజ్‌ ఇమామ్‌ మసీదు వద్ద కూడా బీజేపీ నాయకుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ స్థానిక యువకులు నినాదాలు చేశారు. నుపుర్‌ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరుల ఫొటోలను దహనం చేశారు.  

నుపుర్‌శర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
నుపుర్‌శర్మపై వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. స్థానిక ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌ తెలిపారు.  

ఇది కూడా చదవండి: బీజేపీ వ్యతిరేక నినాదాలు.. మసీదుల వద్ద ఉద్రిక్తత

మరిన్ని వార్తలు