గవర్నర్‌కు రాష్ట్రపతి ఫోన్‌

5 Sep, 2020 04:17 IST|Sakshi

జాతీయ విద్యా విధానంపై తమిళిసైతో కోవింద్‌ సంభాషణ

సాక్షి, హైదరాబాద్‌: ‘జాతీయ విద్యా విధానం– 2020’పై ఈ నెల 7వ తేదీన జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జాతీయ విద్యా విధానంపై వీడియో కాన్ఫరెన్స్‌ సన్నాహాల్లో భాగంగా రాష్ట్రపతి, గవర్నర్‌ మధ్య సంభాషణ జరిగింది. విద్యా రంగంలో అన్ని స్థాయిల్లో నాణ్యత పెరగడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. జాతీయ విద్యా విధానంతోపాటు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి విద్యా రంగ నిపుణులతో ఇటీవల వెబినార్‌ నిర్వహించిన విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు.

వెబినార్‌లో వచ్చిన సూచనలు, సలహాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని గవర్నర్‌ తెలిపారు. ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయాలను ఎక్సలెన్స్‌ సెంటర్లుగా తీర్చిదిద్దడంపై వైస్‌ చాన్స్‌లర్లు, రిజిస్ట్రార్లు, ఇతరులతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించిన విషయాన్ని రాష్ట్రపతికి నివేదించారు. ‘కనెక్ట్‌ చాన్స్‌లర్‌’, ‘చాన్స్‌లర్‌ కనెక్ట్స్‌ అలుమ్ని’వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగం కావడం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్‌ తమిళిసై వివరించారు. విద్యా రంగంలో నాణ్యత కోసం గవర్నర్‌ తీసుకుంటున్న చొరవను ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు