22 రోజులు.. 110 కిలో మీటర్లు..

15 Aug, 2020 02:59 IST|Sakshi

డబ్బుల్లేక రైల్వేట్రాక్‌పై నడక

కూలీ కుటుంబం దీనగాథ

బతుకుదెరువుకు వైజాగ్‌ వెళ్లిన వరంగల్‌ కూలీ కుటుంబం 

కాంట్రాక్టర్‌ పారిపోవడంతో రోడ్డున పడిన బాధితులు 

ఆదుకున్న రైల్వే కూలీ డేవిడ్‌ 

టీఎస్‌ఎస్పీ కేడెట్ల సాయంతో వరంగల్‌ చేరిన కుటుంబం

సాక్షి, హైదరాబాద్‌: కూటి కోసం.. కూలి కోసం.. కాంట్రాక్టర్‌ మాటలు నమ్మి.. వెంట వెళ్లిన కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. చేతిలో చిల్లిగవ్వలేక.. కరోనా వేళ కరుణించేవారు లేక.. కళ్లలో ఆశలుడిగి కాలినడకన బయలుదేరిన ఆ కూలీ కుటుంబానికి ఎంత కష్టం.. ఎంత కష్టం.. 22 రోజులుగా నడిచి నడిచి, ఎడతెరిపిలేని వాననీటిధారలోనే ఎడతెగని కన్నీటిధార కలిసిపోయిన ఆ పేద జంటకు ఎంత కష్టం.. ఎంత కష్టం.. చివరికి కూలీని మరో కూ లీ చెంతకు తీసుకొని చింత తీర్చి మానవత్వం ఇంకా కూలిపోలేదని నిరూపించిన ఘటన ఇది.  

వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం అశోక్‌నగర్‌కు చెందిన భాషబోయిన రమేశ్‌ దినసరి కూలీ. రెండు నెలల కిందట గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ మాటలు నమ్మి భార్య లక్ష్మి, కుమారుడు చక్రిని తీసుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లాడు. తీరా పనిచేయించుకున్న కాంట్రాక్టర్‌ వారికి చెప్పాపెట్టకుండా ఎటో ఉడాయించాడు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ అని వస్తోంది. ఎన్నిరోజులు ఎదురుచూసినా తిరిగిరాలేదు. తనతోపాటు పలువురు స్థానిక, మహారాష్ట్ర నుంచి వచ్చిన కూలీలకు కూడా ఆ కాంట్రాక్టర్‌ కూలి డబ్బులు ఎగ్గొట్టాడు. దీంతో మోసపోయామని గ్రహించిన రమేశ్‌ భార్యాబిడ్డలతో కలసి స్వగ్రామానికి తిరిగి వెళ్లాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చాలామందిని చార్జీ డబ్బుల కోసం బతిమిలాడాడు. కరోనా విజృంభిస్తున్నవేళ ఎవరూ వారిని కరుణించలేదు. కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫోన్‌ స్విచ్చాఫ్‌ అని వస్తుండటంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. రూ.100 చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నారు. లారీ డ్రైవర్లు కూడా వారిని వాహనంలోకి ఎక్కించుకునేందుకు నిరాకరించారు. 

22 రోజులపాటు పట్టాల వెంబడే నడక..!
చేసేదేమీ లేక కాలినడకన రైలు పట్టాల వెంట విశాఖపట్నం నుంచి వరంగల్‌కు బయల్దేరింది ఆ కూలీ కుటుంబం. మార్గమధ్యంలోనూ చాలామందిని అర్థించినా ఫలితం లేకుండా పోయింది. సరిగా తిండి లేకపోవడంతో రోజుకు 4–5 కి.మీ. మాత్రమే నడిచేవారు. స్టేషన్లలో ప్రయాణికులను బతిమిలాడుతూ.. పొట్టనింపుకున్నారు. పట్టాల వెంబడే నిద్రపోవడంతో రమేశ్‌ కుమారుడు చక్రీకి, భార్య లక్ష్మికి పలుమార్లు తేళ్లు కుట్టాయి. అయినా గుండెధైర్యంతో 22 రోజులపాటు పట్టాల వెంట నడక సాగించారు. మధ్యలో ఐదురోజులపాటు ఏకధాటి వాన కురుస్తున్నా నడుస్తూనే ఉన్నారు. దాదాపు 110 కిలోమీటర్ల అనంతరం రాజమండ్రి సమీపంలోని లక్ష్మీనారాయణపురం రైల్వేస్టేషన్‌ వద్దకు బుధవారం రాత్రి 9 గంటలకు చేరుకున్నారు.

అదే సమయంలో అక్కడ పనులు చేసుకుంటున్న రైల్వే కూలీ డేవిడ్‌ వారిని గుర్తించి వివరాలు వాకబు చేశాడు. డేవిడ్‌ ఇటీవల తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుల్‌గా సెలక్టయ్యాడు. ట్రైనింగ్‌ ఇంకా మొదలు కాకపోవడంతో కూలి పనులు చేసుకుంటున్నాడు. రమేశ్‌ తన పరిస్థితి చెప్పగానే డేవిడ్, అతని మిత్రులంతా కలిసి ఆ కుటుంబాన్ని చేరదీశారు. ఆకలి తీర్చి, ఆ రాత్రికి తమ వద్దే ఆశ్రయమిచ్చారు. మర్నాడు డేవిడ్‌ తాను పనిచేసే ఎంఎంఆర్‌ సంస్థ అధికారులకు, తోటి కూలీలకు, తెలంగాణలోని టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు విషయం వివరించాడు. దీంతో వారంతా కలసి రమేశ్‌ కుటుంబానికి ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్‌చేశారు. కూలీలంతా కలసి రాజమండ్రి వరకు ఆటో మాట్లాడి వారిని అందులో ఎక్కించారు. దారి ఖర్చులకు డబ్బులిచ్చారు. రాజమండ్రిలో వరంగల్‌ రైలెక్కించి మానవత్వం చాటుకున్నారు.

మరిన్ని వార్తలు