‘కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఎవరూ చనిపోలేదు’

11 May, 2021 08:33 IST|Sakshi
కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ను నింపే ప్రక్రియను పరిశీలిస్తున్న రమేశ్‌రెడ్డి  

వారివి సహజ మరణాలే..

వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి వివరణ

సాక్షి, హిమాయత్‌నగర్‌: ఆక్సిజన్‌ అందక కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఎవరూ మరణించలేదని వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌ పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఆదివారం మరణించిన ముగ్గురివీ సహజ మరణాలని స్పష్టం చేశారు. ఈ విపత్తు వేళలో ఆక్సిజన్‌ లేక మరణించారన్న వార్తలు పేపర్లలో, టీవీల్లో, సోషల్‌ మీడియాలో వస్తే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని చెప్పారు. ఆదివారం ఆక్సిజన్‌ అందక ముగ్గురు మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్‌ ఓపీ వద్ద పరిస్థితి, ఎంతమంది చికిత్స పొందుతున్నారనే విషయాలను వైద్య బృందం నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరా అవుతున్న గదిని, ఆక్సిజన్‌ నింపే ప్రక్రియను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్, నోడల్‌ అధికారి డాక్టర్‌ మల్లిఖార్జున్, అడిషనల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జలజతో కలసి పరిశీలించారు.

ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఆస్పత్రుల్లో సహజ మరణాలు జరుగుతూనే ఉంటాయని, ఆదివారం చనిపోయిన ముగ్గురు కూడా సహజంగానే చనిపోయారని పునరుద్ఘాటించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నయం కాకపోవడంతో చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని, అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ప్రభుత్వ ఆస్పత్రులకు ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆక్సిజన్‌ సరఫరాపై ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఉందని, ఆ కమిటీ ఆక్సిజన్‌ నిల్వలు, అవసరాలపై నిత్యం మానిటరింగ్‌ చేస్తుందని పేర్కొన్నారు. కాగా, కింగ్‌కోఠి ఆస్పత్రికి 46 కేజీల ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, మరో 50 సిలిండర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. త్వరలో ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ జెనరేటర్‌ నిర్మాణం పూర్తవుతుందని, అలాగే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

చదవండి: కరోనా రోగులకు రాష్ట్రంలోకి నో ఎంట్రీ

మరిన్ని వార్తలు