కుక్కల దాడిపై స్పందించిన వర్మ.. జీహెచ్‌ఎంసీ మేయర్‌పై సెటైర్లు!

23 Feb, 2023 21:21 IST|Sakshi

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఏ కామెంట​్‌ చేసిన సోషల్‌ మీడియాలో పెను సంచలనంగా మారిపోతుంది. అయితే, తాజాగా తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనదైన స్టైల్‌లో వర్మ ఎంటర్‌ అయ్యాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, ఇటీవలి కాలంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో కుక్కల దాడులు పెరుగుతున్న కారణంగా మేయర్‌ విజయలక్ష్మి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా మేయర్‌.. కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై వర్మ స్పందించారు. ఈ సందర్బంగా వర్మ.. కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ సార్‌.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రశ్నించారు. 


అయితే, అంతకుముందు మేయర్‌.. ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్‌ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్‌ చేశారు. కుక్కలన్నీ మేయర్‌ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్‌ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. 

మరిన్ని వార్తలు