సారూ.. మాకేది మోక్షం!

30 Sep, 2020 08:56 IST|Sakshi

జీవో 111పై తొలగని ప్రతిష్టంభన

ఆర్నెల్లలో ఎత్తివేస్తామని ఎన్నికలపుడు కేసీఆర్‌ హామీ

ఇప్పటికీ కదలిక లేదు

84 గ్రామాల అభివృద్ధిపై ప్రభావం

ఎల్‌ఆర్‌ఎస్‌కు నోచుకోని ప్లాట్లు, లేఅవుట్లు

అగమ్యగోచరంగా ప్లాట్ల యజమానుల పరిస్థితి

రూ.కోట్లు గడించిన రియల్‌ వ్యాపారులు

మొయినాబాద్‌ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన బొల్లించెరువు వీరారెడ్డి రైతు. ఏడాది క్రితం మొయినాబాద్‌ సమీపంలోని విజయనగర్‌ కాలనీలో 300 గజాల స్థలాన్ని ఖరీదు చేశాడు. ఇల్లు నిర్మించుకుందామని యత్నిస్తే 111 జీవో పరిధిలో కొత్త నిర్మాణాలు చేపట్టవద్దనే నిబంధనతో అధికారులు అనుమతులు ఇవ్వలేదు. ప్లాటు కొనుగోలు చేసిన లేఅవుట్‌కు సైతం అనుమతులు లేవు. ప్రభుత్వం ఇటీవల ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అక్రమ లేఅవుట్లు, పాట్లను క్రమబద్ధీక రించుకోవడానికి 131 జీవో తీసుకొచ్చింది. కానీ 111 జీవో పరిధిలో రెగ్యులరైజేషన్‌ చేసే పరిస్థితి లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నాడు. ఇది వీరారెడ్డి ఒక్కడి పరిస్థితీ కాదు. దాదాపు లక్ష మంది సమస్య.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల పరిధిలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం లేక.. మరోపక్క జీవో 111 ఎత్తివేతకు అడుగులు పడకపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో చిక్కుకున్నారు. అనధికారికంగా వెలిసిన దాదాపు 3 వేల లేఅవుట్లలో లక్ష మందికిపైగా సామాన్యులు ఇళ్ల స్థలాలు ఖరీదు చేశారు. (చదవండి: ఎల్‌ఆర్‌‘ఎస్‌’.. అనూహ్య స్పందన)

ఈ గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేస్తామని.. గత సాధారణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. అయితే టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారం చేపట్టి 21 నెలలు దాటిపోయినా... 111 జీవో ఎత్తివేతపై ఎటువంటి కదలికా లేదు. ఈ జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించడం లేదు. దాంతో ప్లాట్ల యజమానులు లబోదిబో మంటున్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం ఇక్కడ ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారంతా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారే కావడం గమనార్హం. 

వీడని పీటముడి.. 
జీవో 111 పరిధిలో ఏర్పాటైన వెంచర్లు, లేఅవుట్లపై ప్రభుత్వ ఆలోచన ఏంటన్నది తెలియడం లేదు. సీఎం ఇచ్చిన హామీకి కట్టుబడి సర్కారు జీవో 111ను ఎత్తివేస్తేనే... లేఅవుట్లకు, ప్లాట్లకు మోక్షం లభిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు వీలు చిక్కుతుంది. మరోపక్క జీఓ 111ను ఎత్తివేయాలని ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మరోపక్క ఈ జీవోను సడలిస్తే జంట జలాశయాల మనుగుడ ప్రశ్నార్థకంగా మారనుందని పర్యావరణ వేత్తలు సైతం ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దీనికితోడు ఈ జీవో ప్రభావిత గ్రామాల నుంచి ప్రభుత్వం తీర్మానాలను తీసుకుంటోంది. మహా నగరానికి ఆనుకుని ఉన్నా.. తమ ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, కాబట్టి ఈ జీవోని ఎత్తివేయాలని సర్పంచ్‌లు తీర్మానించి ప్రభుత్వానికి పంపించారు. మొత్తంమీద ఈ అంశం సంక్లిష్టంగా మారడంతో ఎప్పటికి మోక్షం కలుగుతుందో  చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

ఏమిటీ 111 జీవో?
హైదరాబాద్‌ మహానగరానికి తాగునీరందించే ఉస్మాన్‌సాగర్‌ (గండి పేట), హిమాయత్‌సాగర్‌ జలాశయాల పరిరక్షణతోపాటు నీటి కాలుష్యాన్ని నివారించేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఈ జంట జలాశయాల ఎగువన ఉన్న, క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, శంషా బాద్, షాబాద్‌ మండలాల పరిధిలోని 84 గ్రామాలను జీవో పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. సహజ నీటి ప్రవా హాలకు ఆటంకాలు ఏర్పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే రియల్‌ వ్యాపారులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ సుమారు 3 వేల వెంచర్లు చేసి సామాన్యులకు ప్లాట్లు కట్టబెట్టారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. ప్లాట్లన్నింటినీ వ్యాపారులు విక్రయించాక.. ఇటీవల అధికారులు అనధికార వెంచర్లంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు, వ్యతిరేకత రావడంతో చివరకు వెనకడుగు వేశారు. ఈక్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌.. ఆశాదీపంలా కనిపించినా అందుకు అవకాశం లేకపోవడంతో ప్లాట్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 

ఎప్పటి నుంచో కోరుతున్నాం
జీవో 111తో మా గ్రామాల్లో అభివృద్ధి చాలా వెనకబడింది. దీనిని తొలగించాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. భూములు అమ్ముకునేందుకు చూస్తున్న రైతులకు ధరలు తక్కువ వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవోను తొలగిస్తామని హామీ ఇచ్చారు.  మాకు ఊరట కలిగిస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే ఈ జీవోపై సడలింపులు కాని, ఎత్తివేతగాని వస్తుందని విశ్వసిస్తున్నాం. అప్పుడే మా గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తాయి.
– శేరి శివారెడ్డి, మల్కాపురం సర్పంచ్, చేవెళ్ల మండలం
 

మరిన్ని వార్తలు