ఎయిర్‌ ఇండియాకు జరిమానా

3 Jan, 2023 14:14 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లాకోర్టులు: రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు శ్రీమతి చిట్టినేని లతా కుమారి నేతృత్వంలోని బెంచ్‌ ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థకు రూ.10 వేలు జరిమానా విధించింది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చిలకమర్తి గోపీకృష్ణ 2020 అక్టోబర్లో శాన్‌ ఫ్రాన్సిస్కో నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా సదరు విమానయాన సంస్థ టికెట్‌ను రద్దు చేసింది.

రద్దు చేసినందుకు టికెట్‌ ధర రూ. 71,437లను తిరిగి చెల్లించేందుకు అగీకరిస్తూ ఇందుకు సంబందించి ప్రక్రియ మొదలు పెట్టినట్టు మార్చి 2021లో సమాచారం అందించింది. ఆ తర్వాత సదరు సంస్థ వినియోగదారుడికి ఎటువంటి జవాబు ఇవ్వకపోగా, ఇది వరకే రీఫండ్‌ చేశామని చెప్పడంతో బాధితుడు గోపీకృష్ణ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

ఆ తర్వాత 20 రోజులకు రూ. 71,437/–ల టికెట్టు రుసుమును గోపీకృష్ణకు చెల్లించి ఫోరం ఎదుట వాదనలు వినిపించిన సంస్థకు చెల్లింపుల్లో జరిగిన జాప్యాన్ని పరిగణలోకి తీసుకున్న ఫోరం విమానయాన సంస్థ సేవల లోపం కారణంగానే జాప్యం జరిగిందని నిర్ధారిస్తూ సంస్థకు జరిమానాతో పాటు టికెట్‌ రుసుముపై ఐదు నెలలకు 6% వార్షిక వడ్డీ చెల్లించాలని తీర్పు వెలువరించింది. 

చదవండి: (CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!)

మరిన్ని వార్తలు