తెలంగాణలో వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు 

11 Nov, 2021 03:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఆగ్నేయ భారతదేశం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండడంతో పాటు, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం రాష్ట్రంలో గరిష్టంగా ఖమ్మంలో 31.2 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో కనిష్టంగా 11.2 డిగ్రీలు నమోదయ్యింది. చాలాచోట్ల సాధారణం కంటే 3.65 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

తగిన దుస్తులు ధరించాలి 

  •      చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయి. ఆ సమయంలో శరీరంలో ఎక్కు వ భాగం కవర్‌ అయ్యే విధంగా దుస్తులు ధరించాలి.  ∙చలి సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. 
  • చలికాలంలో రాత్రి వేళ గుండెపోటులు ఎక్కువగా నమోదవుతుంటాయి. మధ్యరాత్రి, తెల్లవారుజాముల్లో హార్ట్‌ ఎటాక్‌కు ఆస్కారం ఉంటుంది. చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం, రక్తం గడ్డకట్టడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. హృద్రోగులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్‌ వేసుకుని ఉండాలి. 
  • ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. చలిగాలుల ప్రభావంతో ఇలాంటి వాళ్లు త్వరగా అనారోగ్య సమస్యలకు గురి కావొచ్చు. అలాంటివాళ్లు ఇబ్బందులు తలెత్తితే వీలైనంత త్వరితంగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. 
  • చలికాలంలో కాలుష్య ప్రభావంతో పొగమంచుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు సాగించడం మంచిది. 
  • చలికాలంలో మితిమీరిన ఎక్సర్‌సైజులు చేయడం కూడా మంచిది కాదు.

మరో వారం పాటు ఇలాంటి మార్పులు 
గత రెండు,మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో మరో వారం రోజుల వరకు ఇలాగే మార్పులు నమోదవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అటుఇటుగా ఉన్నాయి.     – నాగరత్న, వాతావరణ శాఖ అధికారి 

సమయానికి మందులు వేసుకోవాలి 
దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్లు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. వైద్యులు సూచించిన సమయాల్లో కాకుండా ఆలస్యంగా మందులు వేసుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం కోవిడ్‌–19 వ్యాప్తి కొనసాగుతున్నందున జలుబు, జ్వరం, దగ్గు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు తీవ్రమైతే కోవిడ్‌–19 పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచిచూడకుండా వైద్యుల సూచనలతో తగిన విధంగా మందులు వాడాలి. స్వీట్లు, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్‌ను వీలైనంత తగ్గించాలి. తాగునీరు కూడా చల్లగా కాకుండా గోరువెచ్చగా చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది.      
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ వైద్య కళాశాల  

>
మరిన్ని వార్తలు