ఎండకు ఎండి.. వానకు తడిసి.. 

19 Jul, 2021 02:07 IST|Sakshi

ధ్వంసమవుతున్న కాకతీయుల కాలంనాటి అపురూప శిల్పకళ

ఇవన్నీ కాకతీయుల కాలంలో అద్భుత నైపుణ్యంతో చెక్కిన శిల్పాలు. దాదాపు ఎనిమిది వందల ఏళ్లక్రితం రూపుదిద్దుకున్న అపురూప శిల్పాలు ఇప్పుడు ఇలా అవగాహనలేమితో నిర్లక్ష్యానికి గురై ధ్వంసమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామంలోని అతి పురాతన శంభుదేవుని ఆలయం ప్రాంగణంలోని శిథిల కోనేరు గట్టునానుకుని వీటిని ఇలా పడేశారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, నజీరుద్దీన్‌లు ఇచ్చిన సమాచారంతో, వారితో కలిసి పురావస్తు పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆదివారం వాటిని పరిశీలించారు. దేవాలయ నిర్వాహకులతో చర్చించి వాటిని ఆలయం మండపంలో ఏర్పాటు చేసి, వాటి కాలానికి సంబంధించిన నామఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అరుదుగా ఉండే రెండంతస్తుల కాకతీయ మండపానికి అనుకుని ఇతర నిర్మాణాలు చేపట్టి దాని చారిత్రక ప్రాశస్త్యం కోల్పేయేలా చేయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో బాదామీ చాళుక్యుల కాలం ఏడో శతాబ్దినాటి శివలింగం, నాగ ప్రతిమలు, 11వ శతాబ్ది నాటి పార్శ్వనాథుడి జైన విగ్రహం, 1296 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనం ఉన్నాయి.

మరిన్ని వార్తలు